Autorickshaw Blast Mangaluru:
భయభ్రాంతుల సృష్టించేందుకే..
కర్ణాటకలోని మంగళూరులో ఆటో రిక్షా పేలుడు ఘటన సంచలనం రేపింది. ఇది ఉగ్రవాదుల పనా..? లేదంటే ఎవరైనా కావాలనే భయ భ్రాంతులకు గురి చేసేందుకు చేశారా..?" అన్నఅనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే..దీనిపై కర్ణాటక పోలీసులు వివరణ ఇచ్చారు. "ఈ పేలుడు అనుకోకుండా జరిగింది కాదు. కేవలం భారీగా ఆస్తి, ప్రాణనష్టాన్ని కలిగించేందుకు పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఉగ్రవాద చర్య" అని వెల్లడించారు. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. "కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో పూర్తి స్థాయి విచారణ జరుపుతాం" అని తెలిపారు. కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా దీనిపై స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పోలీసులకు సహకరిస్తున్నాయని వెల్లడించారు. " ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ప్రస్తుతానికి మాట్లాడే స్థితిలో లేడు. పోలీసులు వీలైనంత మేర సమాచారం సేకరిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఇది ఉగ్రవాద చర్య అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించాం. ఆ టీమ్‌లు మంగళూరుకు వెళ్తున్నాయి. మరో రెండ్రోజుల్లో పూర్తి స్థాయి సమాచారం తెలుస్తుందని ఆశిస్తున్నాం" అని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. ఆటో రిక్షాలో ఓ ప్రెజర్ కుకర్‌ను స్వాధీనంచేసుకున్నారు. దీన్ని బ్యాటరీలతో పేల్చినట్టు తేలింది.
టార్గెట్ ఏంటో అర్థం కాలేదు: పోలీసులు
"ఆటోలో ప్రయాణించిన వ్యక్తినే అనుమానిస్తున్నాం. ఆ వ్యక్తి నుంచి ఆధార్ కార్డ్ స్వాధీనం చేసుకున్నాం. హుబ్బళికి చెందిన వ్యక్తిగా గుర్తించాం. ఆధార్ కార్డ్‌పై ఉన్న ఫోటోకి, ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. ఇదే ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఏదో లక్ష్యంతోనే ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నాం. కానీ...ఆ టార్గెట్ ఏంటన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇటీవల కోయంబత్తూర్‌లో జరిగిన పేలుడుకి..ఈ వ్యక్తికి సంబంధం ఉందని భావించటం లేదు. కర్ణాటకు చెందిన ఈ వ్యక్తి...కొన్ని రోజుల పాటు వేరే రాష్ట్రాల్లోనూ పర్యటించినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూర్ సహా మరి కొన్ని ప్రాంతాల్లో సంచరిచాడు. ఆటోలో పెట్టిన బాంబు మరీ ప్రమాదకరమైంది కాదు. ఆ వ్యక్తి ఏం చేయాలనుకున్నాడన్నది అర్థం కాలేదు" అని ప్రవీణ్ సూద్ వెల్లడించారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.