Maharashtra Governor Remark:


దుమారం రేపుతున్న కామెంట్స్..


మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి తరచూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు మరోసారి అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఛత్రపత్రి శివాజీ చేసిన కామెంట్స్‌ మహారాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా మండి పడుతోంది. ఛత్రపతి శివాజీ ఐకానిక్ పర్సనాలిటీ అయినా అదంతా పాత రోజుల్లోనని...ఇప్పటి ఐకానిక్ పర్సనాలిటీస్ బీఆర్ అంబేడ్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అని ఆయన చేసిన కామెంట్స్‌తో పెద్ద దుమారం రేగింది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)తో పాటు ఠాక్రే నేతృత్వంలోని శివసేన విమర్శలు ధాటిని పెంచింది. "ఇది ఛత్రపతి శివాజీకి తీరని అవమానం" అని విమర్శిస్తున్నాయి. ఔరంగాబాద్‌ లోని డాక్టర్ బాబాసాహెబ్ అండేక్కర్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు...గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ. ఆ సమయంలోనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఒకప్పుడు భారత్‌లో ఐకాన్‌ లాంటి వ్యక్తులెవరంటే నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ అని సమాధానం ఇచ్చేవారు. కానీ...మహారాష్ట్ర ఈ విషయంలో ప్రత్యేకం. ఇక్కడ ఎంతో మంది గొప్ప వ్యక్తులున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఒకప్పటి ఐకాన్. కానీ ఇప్పుడు అంబేడ్కర్‌, నితిన్ గడ్కరీ ఆ స్థాయిలో ఉన్నారు" అని అన్నారు గవర్నర్. కేంద్ర మంత్రి గడ్కరీని, ఛత్రపతి శివాజీతో పోల్చడమేంటని విమర్శలు ఎదుర్కొంటున్నారు. "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న వ్యక్తి తరచూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం ఆయన వ్యాఖ్యలపై ఎప్పుడూ మౌనంగానే ఉంటోంది. ఇది మహారాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తోంది" అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శివసేన సీనియర్ 
నేత సంజయ్ రౌత్ కూడా గవర్నర్‌పై తీవ్రంగా మండి పడ్డారు. ఛత్రపతి శివాజీ అందించిన స్ఫూర్తిని నేటి తరాలూ అందిపుచ్చుకుంటు న్నాయని, అలాంటి వ్యక్తిని అవమానించడం ఏంటని ప్రశ్నించారు. 


గతంలోనూ వివాదాలు..


గతంలోనూ మహారాష్ట్ర ప్రజల్ని అవమానిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భగవత్ సింగ్. గుజరాతీలు, రాజస్థానీలు లేకపోతే రాష్ట్రానికి ఆదాయమే ఉండదని అన్నారు. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను తీసేస్తే రాష్ట్రానికి రెవెన్యూనే ఉండదని వివాదాస్పద 
వ్యాఖ్యలు చేశారు. ముంబయి, థానే నుంచి వారిని వేరు చేయలేమని, వారు అక్కడి నుంచి వెళ్లిపోతే రాష్ట్రానికి ఆదాయమే ఉండదన్న ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశారు. అంతే కాదు. ఇదే జరిగితే... ముంబయి దేశ ఆర్థిక రాజధానిగానూ కొనసాగలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై 
ఠాక్రే శివసేన తీవ్రంగా మండిపడింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గవర్నర్‌పై ఆగ్రహించారు. "మరాఠీలను అవమానించారు" అంటూ ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిజానికి ఎన్నో ఏళ్లుగా...మహారాష్ట్రలో మరాఠీలకు, గుజరాతీలకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 
ఇలాంటి వాతావరణం ఉన్న రాష్ట్రంలో గవర్నర్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంపై సంజయ్ రౌత్‌ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన చేసిన కామెంట్స్‌ను వెంటనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఖండించాలని డిమాండ్ చేశారు.


Also Read: Gujarat Election 2022: ఈ సారి గత రికార్డులన్నీ బద్దలవ్వాలి, ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ గెలవాలి - పీఎం మోడీ