Atmakur Bypoll Counting Today: దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలకోసం ఈరోజు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఫలితం కూడా ఈరోజే తేలిపోతుంది. మరికొన్ని గంటల్లో ఫలితం విడుదలవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు.
20 రౌండ్లలో ఫలితం..
ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీ వద్ద కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కౌంటింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఓట్లు లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి, పార్టీ ఏజెంట్లకు, మీడియాకి పాస్ లు మంజూరు చేశారు. పాస్ లు లేనివారిని కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించడంలేదు. ఓట్ల లెక్కింపుకి సంబంధించి కౌంటింగ్ హాల్ లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు.
8 గంటలకు లెక్కింపు మొదలు..
ఉదయం 8 గంటలకు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుతో ఓట్లు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు అధికారులు. ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. గంటల వ్యవధిలోనే ఫలితం వెలువడుతుంది. ప్రతి టేబుల్ కు ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్.. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొంటారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత.. వీవీప్యాట్లను ర్యాండమ్ గా ఎంపిక చేసి.. 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీ ప్యాట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టమైన బందోబస్తు మధ్య నిర్వహించబోతున్నారు.
మెజార్టీ ఎంత..?
ఆత్మకూరు ఉప ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ లక్ష ఓట్ల మెజార్టీని అంచనా వేస్తోంది. అయితే పోలింగ్ శాతం, పోలైన ఓట్లను బట్టి చూస్తే లక్ష ఓట్ల మెజార్టీ అసాధ్యమని తేలిపోయింది. దీంతో మెజార్టీ లక్షకు కాస్త తగ్గినా.. విజయం మాదేనంటోంది వైసీపీ. సుమారు 70వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి ఇక్కడ గెలుపొందుతారని వైసీపీ నేతలంటున్నారు.
బీజేపీ ధీమా..
అటు బీజేపీ నేతలు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గెలుపు అసాధ్యమని తేలినా.. వైసీపీ మెజార్టీని తగ్గించే విషయంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. పోలింగ్ శాతం తగ్గడమే తమ తొలి విజయంగా బీజేపీ భావిస్తోంది. ఇక ఓట్ల శాతం కూడా మెరుగుపడితే.. ఆ పార్టీ పడిన కష్టానికి ఫలితం లభించినట్టేనని అంటున్నారు. మొత్తమ్మీద ఏపీలో మూడేళ్ల జగన్ పాలనకు ఏపీ ప్రజలు ఎన్ని మార్కులేస్తారనేది ఆత్మకూరు ఉప ఎన్నికల్లో చూచాయగా బయటపడే అవకాశముంది.
Also Read: Atmakur Bypoll : వైసీపీ లెక్కలు మారిపోతాయా? ఆత్మకూరులో జోరుగా బెట్టింగ్
Also Read: Atmakur By Elections : ముగిసిన ఆత్మకూరు ఉపఎన్నికల పోలింగ్- తగ్గిన పోలింగ్ పర్సంటేజీ