Atmakur Bypoll : ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమే అయితే ఆ పార్టీకి వచ్చే మెజార్టీ ఎంతనేదే ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. బీజేపీ చివరి వరకూ ప్రయత్నం చేసినా.. దాదాపుగా అధికార పార్టీ పట్టునిలుపుకునే అవకాశముందనే అంచనాలున్నాయి. అయితే వైసీపీ ఊహించినట్టుగా లక్ష ఓట్ల మెజార్టీ అనేది అసాధ్యం అని తేలిపోయింది. ఓటింగ్ శాతం తగ్గిపోవడంతో లక్ష మెజార్టీ సాధ్యం కాదని తెలుస్తోంది. 



  • ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం ఓట్ల సంఖ్య 2,13,338

  • వీటిలో పోలైన ఓట్ల సంఖ్య 1,37,081

  • 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజార్టీ 22,276

  • 2019లో పోలింగ్ శాతం 83.23


మేకపాటి ఫ్యామిలీపై సింపతీ పనిచేసినా సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు విపరీతంగా ప్రజలకు నచ్చినా.. ఓటింగ్ శాతం ఈసారి కచ్చితంగా పెరిగి ఉండేది. పోనీ సార్వత్రిక ఎన్నికల్లో లాగా 83 శాతానికి కాస్త అటు ఇటుగా ఉండేది. కానీ ఈసారి పోలింగ్ శాతం కేవలం 64 దగ్గరే ఆగిపోయింది. అంటే నూటికి 36 మంది పోలింగ్ కి దూరంగా ఉన్నారు. వారంతా టీడీపీ, జనసేన మద్దతుదారులే అనుకున్నా కూడా జనాలను పోలింగ్ స్టేషన్లకు తరలించడానికి వైసీపీ పడ్డ కష్టం ఫలించలేదనే చెప్పాలి.  ప్రస్తుతం పోలైన ఓట్లు 1,37,081. ఇందులో బీజేపీ, ఇండిపెండెంట్లకు 30వేల ఓట్లు తీసి పక్కనపెట్టినా.. వైసీపీకి లక్షా 7వేల ఓట్లు వస్తాయి. ఎలా చూసినా మెజార్టీ 70వేలకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. అంటే వైసీపీ ఊహించినట్టుగా లక్ష ఓట్లమెజార్టీ మాత్రం రాదనే చెప్పాలి. 


జోరుగా బెట్టింగ్


వైసీపీకి వచ్చే ఓట్లు ఎన్ని, మెజార్టీ ఎంత అనే విషయంలో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అభిమానులు కూడా లక్ష ఓట్ల మెజార్టీపై మాట మార్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా ఇటీవల ఒంగోలులో జరిగిన మీటింగ్ లో 70వేల మెజార్టీ వస్తుందని చెప్పారు. అంటే లక్ష మెజార్టీ అనేది అసాధ్యమని తేలిపోయింది. ఒకవేళ 70వేలకంటే మెజార్టీ మరింత తగ్గితే మాత్రం అధికార పార్టీ ఆలోచనలో పడాల్సిందే. 


బీజేపీ గట్టిపోటీ 


ఆత్మకూరులో బీజేపీ గట్టిపోటీనిచ్చిందనే చెప్పాలి. గెలుపు అసాధ్యం అని తేలినా కూడా.. నాయకులు మాత్రం పట్టువిడవలేదు. జనసేన మద్దతు లేకపోయినా బీజేపీ నాయకులంతా ఆత్మకూరు పర్యటనలకు వచ్చారు, నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అభ్యర్థితోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు.. నియోజకవర్గంలో పర్యటించారు. వీలైనంత మేర వైసీపీ మెజార్టీ తగ్గించేందుకు వారు కృషి చేశారు. పోలింగ్ పర్సంటేజీ తగ్గడంతో ప్రజాభిమానం వైసీపీకి లేదని ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. రేపు మెజార్టీ సంగతి తేలితే.. మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఖాయం.