ATM Cash Withdrawal: నేటి కాలంలో Automated Teller Machine, అదేనండీ ATM లేనిదే జనానికి కాళ్లు, చేతులు ఆడవు. దీనిని ఎనీ టైమ్ మనీ లేదా ఆల్ టైమ్ మనీ అని కూడా సరదాగా పిలుస్తుంటారు. అది చేసే పని కూడా ఈ పేర్లకు తగ్గట్టుగానే ఉంటుంది.
మొబైల్ ఫోన్‌లాగా ATM కూడా మన దైనందిన జీవనంలో ఒక భాగమైంది. ఇంటికి అతి దగ్గరలో ఉన్న ATMకు వెళ్లి సులభంగా డబ్బు తెచ్చుకోవచ్చు. అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మొబైల్ నంబర్ మార్చుకోవడం సహా మరికొన్ని సేవల కోసం బ్యాంక్ వరకు వెళ్లకుండా ATMలోనే సొంతంగా, సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
అసలు విషయంలోకి వద్దాం. ATM అనేది మనిషి కాదు. ఇదొక యంత్రం. కాబట్టి, అప్పుడప్పుడు మొరాయిస్తుంటుంది. సరిగ్గా మీరు డబ్బులు తీసేటప్పుడే ఇది పని చేయడం ఆగిపోయి, మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే, అప్పుడేం చేయాలి?.
ఆందోళన చెందొద్దు, డబ్బులు తిరిగొస్తాయ్
ఇది ఎప్పుడో ఒకసారి అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ATM నుండి నగదు విత్‌డ్రా చేసుకునేటప్పుడు ఇలాంటి సమస్యను మీరు ఎదుర్కొంటే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని పద్ధతులు పాటిస్తే మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. డబ్బులు కట్ అయిన వెంటనే పానిక్ అవ్వకుండా కూల్‌గా ఉండండి. మేం చెప్పే పద్ధతుల ద్వారా మీ డబ్బును సులభంగా తిరిగి పొందవచ్చు.
అకౌంట్‌లోని డబ్బులు కట్ అయి ATM నుంచి రాకపోతే, సాధారణంగా 30 నిమిషాల్లోపే ఆ డబ్బు తిరిగి మీ అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది. అప్పటికీ డబ్బులు తిరిగి రాకపోతే, సమీపంలో ఉన్న మీ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి విషయం వివరించండి. ఇది కాకుండా, మీ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి కూడా ఈ సమస్యను చెప్పి, ఒక ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఈ విషయంపై బ్యాంక్ చర్యలు తీసుకుని, ఫిర్యాదు తేదీ నుంచి ఏడు రోజుల్లోపు మీ డబ్బు మొత్తాన్ని తిరిగి అకౌంట్‌లో జమ చేస్తుంది.
డబ్బు విత్‌డ్రా చేసినప్పుడు అకౌంట్‌లో తగ్గినా ATM నుంచి రాకపోతే, ఆ లావాదేవీ నంబర్ గుర్తు పెట్టుకోండి. ఇది మీ ATM లావాదేవీకి రుజువుగా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా, మీ మొబైల్‌లో సందేశాలను అలాగే ఉంచండి. ఇది కాకుండా, మీరు బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా తీసి, రుజువుగా చూపించవచ్చు. వీటికితోడు, ATMలో CC కెమెరా ఫుటేజ్ ఎలాగూ ఉండనే ఉంటుంది. అయితే, విషయం ఇంతదూరం రాకముందే 99% కేసుల్లో సెటిల్ అవుతుంది.
బ్యాంక్‌కు జరిమానా
అన్ని రుజువులను ఇచ్చిన తర్వాత కూడా 7 రోజుల లోపు బ్యాంకు మీ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోతే, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం 8వ రోజు నుంచి సదరు బ్యాంకు రోజుకు రూ. 100 చొప్పున బాధిత కస్టమర్‌కు జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. జనం నుంచి లాక్కోవడమే తప్ప, ఇవ్వడం బ్యాంకులకు అలవాటు లేదు కాబట్టి, పరిస్థితిని జరిమానా వరకు అవి తీసుకెళ్లవు. 99% కేసుల్లో 2,3 రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తాయి. గరిష్టంగా 7 రోజుల లోపు సెటిల్ చేస్తాయి. మీ డబ్బు గరిష్టంగా 7 రోజుల్లోపు తిరిగి వస్తుంది కాబట్టి భయపడుకుండా నిశ్చింతగా ఉండండి.