Delhi CM Atishi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. మొన్నటిదాకా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు, ట్వీట్లతో దుమారం రేపగా.. ఇప్పుడు మరోసారి ఆ పార్టీకి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది. మీడియా సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కంటతడి పెట్టారు. రాజకీయాలు ఇంతగా దిగజారిపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఆయన ఇటీవల అతిషి ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలు ఆమెను తీవ్రంగా బాధించడంతో.. సోమవారం ఆమె ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు.
తనపై బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర ప్రకటనపై అతిషి విరుచుకుపడ్డారు. ఎన్నికల కోసం ఎంతవరకైనా దిగజారుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుడని కూడా చూడకుండా దుర్భాషలాడతారా అని మండిపడ్డారు. రాజకీయాలు ఇంతలా దిగజారుతాయని అస్సలు అనుకోలేదన్నారు. తన తండ్రి జీవితమంతా టీచర్ వృత్తికే అంకితం చేశారని, పేద మధ్య తరగతికి చెందిన వేలాది మంది పిల్లలకు ఆయన పాఠాలు చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తన తండ్రి వయసు 80 సంవత్సరాలని, ప్రస్తుతం అస్వస్థతతో ఉన్నారని, ఒకరి సాయం లేకుండా నడవలేకపోతున్నారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం తన తండ్రిపై బురద చల్లుతారా అని కోప్పడ్డారు. ఒక వృద్ధుడిపై నిందలు వేస్తారా అని ధ్వజమెత్తారు. బిధూరి పదేళ్లుగా కల్కాజీ నియోజకవర్గానికి ఏమైనా పనులు చేసి ఉంటే వాటిని ప్రచారంలో చెప్పుకోవాలి.. గానీ.. ఇలా ఓట్ల కోసం తన తండ్రిని అవమానించిడం సరికాదని అతిషి ఆవేదన వ్యక్తం చేశారు.
బిధూరి ఏమన్నారంటే..
అతిషి ఇంటిపేరు 'మార్లేనా'.. కానీ ఇప్పుడు ఆమె 'సింగ్'గా పేరు మార్చుకున్నారు అని రోహిణిలో జరిగిన బీజేపీ పరివర్తన ర్యాలీలో రమేష్ బిధూరి ఆరోపించారు. కల్కాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అతిషి కొద్ది కాలం క్రితమే తన ఇంటిపేరును మార్చుకుని తన తండ్రినే మార్చేశారన్నారు. ఇది ఆప్ పాత్రను ప్రతిబింబిస్తుందని విమర్శించారు. కాగా కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రమేష్ బిధూరి పోటీ చేస్తున్నారు.
హద్దులు మీరుతున్నారన్న కేజ్రీవాల్
బీజేపీ నేతలు హద్దులన్నీ దాటిపోయారంటూ రమేశ్ బిధూరిపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. "బీజేపీ నాయకులు అన్ని హద్దులు దాటిపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని దుర్భాషలాడుతున్నారు. అతిషి జీ మీరు ఢిల్లీ మహిలందరికీ స్ఫూర్తి. ఇది మిమ్మల్ని మాత్రమే అవమానించినట్టు కాదు ఢిల్లీలోని ప్రతి మహిళను అవమానించినట్టు. మహిళా ముఖ్యమంత్రిని అవమానించడాన్ని ఢిల్లీ ప్రజలు సహించరు. ఢిల్లీ మహిళలందరూ దీనికి ప్రతీకారం తీర్చుకుంటారు" అని కేజ్రీవాల్ X లో ఒక పోస్ట్ లో రాశారు.
Also Read : BRS MLC Kavitha: ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు- కేటీఆర్ ఏసీబీ విచారణ తీరుపై కవిత మండిపాటు