వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ మిగతా పార్టీల కన్నా అధికంగా సీట్లు సాధించే అవకాశం ఉందని తాజా సర్వే చెబుతోంది. ఏబీపీ-సీఓటర్ తాజాగా చేసిన సర్వేలో బీజేపీ ప్రత్యర్థి పార్టీల కన్నా ఒక అడుగు ముందు ఉన్నట్లు తెలుస్తోంది. 


2022లో పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనే అంశంపై ఏబీపీ న్యూస్ సీఓటర్ సౌజన్యంతో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నాలుగు రాష్ట్రాల్లో ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల కన్నా బీజేపీ ఒక అడుగు ముందున్నట్లు సర్వే తేల్చింది. 


పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూల గాలులు వీస్తున్నాయి. అన్ని కలిసొస్తే పంజాబ్ లో అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు సర్వేలో తెలుస్తోంది. మెజారిటీ మార్క్ కు అడుగు దూరంలో నిలిచే అవకాశం ఉన్నట్లు ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే చెబుతోంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. 


ఉత్తర్ ప్రదేశ్ 


ఏబీపీ న్యూస్-సీఓటర్ సర్వే ప్రకారం  ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ మొత్తం స్థానాలు 403లో బీజేపీ కూటమి 263 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. 41.8 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 30.2 శాతం ఓట్లతో 113 సీట్లతో రెండో స్థానంలో సమాజ్ వాదీ పార్టీ నిలిచే అవకాశం ఉంది. మాయావతి అధ్యక్షతన బహుజన్ సమాజ్ పార్టీ 14 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీఎస్పీ ఓట్ల శాతం 15.7 గా ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో సుమారు 40 శాతం ఓటర్లు యోగి ఆదిత్యనాధ్ సీఎం అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఉన్నారు. 


Also Read: నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో టాలీవుడ్ పెద్దలు భేటీ.. నాగార్జున హాజరు డౌటే!


ఉత్తరాఖండ్


ఉత్తరాఖండ్ లో బీజేపీకి స్వల్ప అధిక్యం లభించే అవకాశం ఉంది.  70 స్థానాలున్న ఉత్తరాఖండ్ లో 44-48 సీట్లు బీజేపీ కూటమికి దక్కే అవకాశం ఉందని సర్వే తేల్చింది. ఈసారి కాంగ్రెస్ కూటమికి సీట్లు పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూటమికి 19 నుంచి 23 సీట్లు గెలవవచ్చని ఏబీపీ-సీఓటర్ సర్వ చెబుతోంది. ఉత్తరాఖండ్ లో ఆమ్ ఆద్మీ అడుగు పెట్టే అవకాశం ఉంది. వీరిని 0-4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 0-2 గెలవవచ్చని తెలుస్తోంది. 


గోవా


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ పాగా వేసే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో 24 సీట్లు కాషాయ పార్టీ దక్కే అవకాశం ఉంది. మళ్లీ బీజేపీ నేత ప్రమోద్ సావంత్ సీఎం అభ్యర్థి కావాలని 33 శాతం ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. గోవాలో ఆమ్ ఆద్మీ ప్రతిపక్షంగా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రతిపక్షం కాంగ్రెస్ కన్నా ఆమ్ ఆద్మీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 22.2 శాతం ఓట్లతో 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 15.4 శాతం ఓట్లతో 5 సీట్లు గెలిచే అవకాశం ఉంది. 


Also Read: Mansas Trust: మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్, బోర్డు సభ్యులుగా ఎవరిని నియమించినా పర్లేదు...కానీ


మణిపూర్ 


మణిపూర్ లో బీజేపీ కూటమికి 40.5 శాతం ఓట్లతో 34 సీట్లు వచ్చే అవకాశం ఉంది ఏపీబీ-సీఓటర్ సర్వే తేల్చింది. కాంగ్రెస్ కూటమి 34.5 ఓట్ల శాతంతో 20 స్థానాలు గెలుస్తుందని తెలిపింది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడింది. కానీ 21 సీట్లు గెలిచిన బీజేపీ 11 మంది ఎన్పీపీ, ఎన్పీఎఫ్, ఇండిపెండెంట్లు, ఒక తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుతో అధికారం చేపట్టింది. మణిపూర్ అసెంబ్లీ స్థానాలు 60. 


పంజాబ్ 


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి అన్ని మేజర్ పొలిటికల్ పార్టీలకు కీలకం కానున్నాయి. ఏఏపీ, శిరోమణి అకాలి దల్, కాంగ్రెస్ పార్టీలకు దాదాపుగా ఒకే స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.  కానీ ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించే అకాశం ఉందని ప్రకటించింది. ఆమ్ ఆద్మీకి 35 శాతం ఓట్లతో 55 స్థానాలు రానున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 29 శాతం ఓట్లతో 42 సీట్లు దక్కే అవకాశం ఉంది. పంజాబ్ లో పాపులర్ లీడర్ గా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ఆయనకు 21.6 శాతం ఓటర్లు మద్దతు తెలిపారు.  శిరోమణి అకాలి దల్ నేత సుఖ్ భీర్ సింగ్ బాదల్ రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 19 శాతం మంది ఓటర్లు మద్దతు తెలిపారు. తర్వాతి స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ నిలిచారు. 


 


Also Read: UP Election 2022 Predictions: యూపీలో మళ్లీ బీజేపీదే హవా.. మరోసారి సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌.. కానీ!