Tripura Election Results 2023:


బీజేపీ హవా 


త్రిపుర, నాగాలాండ్‌లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి హవా కొనసాగింది. మేఘాలయలో మాత్రం కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్రిపురలో బీజేపీ కూటమి 33 చోట్ల గెలుపుకి ఓ అడుగు దూరంలో ఉంది. నాగాలాండ్‌లోనే మేజిక్ ఫిగర్ 31 మార్క్‌ను దాటింది బీజేపీ కూటమి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే త్రిపురలో తిప్రా మోత పార్టీ నుంచి బీజేపీ కూటమికి గట్టి పోటీ ఎదురైంది. ఒంటరిగా బరిలోకి దిగిన ఈ పార్టీ ఏకంగా 12 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ భారీ విజయం సాధించిందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటికే త్రిపురలో బీజేపీ సంబరాలు మొదలయ్యాయి. అగర్తలా లోని పార్టీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున సందడి చేశారు కార్యకర్తలు. మాణిక్ సాహా విజయంతో మరోసారి ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాగాలాండ్‌లో BJP-NDPP కూటమి 33 చోట్ల విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను దక్కించుకుంది. నాగాలాండ్‌ చరిత్రలోనే తొలిసారి ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హెకానీ జఖాలు (Hekani Jakhalu) రికార్డు సృష్టించగా..ఆ తర్వాత కొద్దిసేపటికే సల్హౌతునొ క్రుసె (Salhoutuonuo Kruse) గెలుపొందారు. వీరిద్దరూ NDPP అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు.