అస్సాం-మిజోరం సరిహద్దులో ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో శనివారం పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఏ క్షణంలో ఏంజరుగుతుందో అన్న ఆందోళనలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇతర రాష్ట్రాలతో సరిహద్దు విషయమై ఉన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా అస్సాం చర్యలు ప్రారభించింది. ఈ మేరకు అస్సాం- నాగాలాండ్ సరిహద్దులో నెలకొన్న వివాదం పరిష్కారానికి ఇరు ప్రభుత్వాలు శనివారం ఒక ఒప్పందానికి వచ్చాయి. వివాదాస్పద ప్రాంతాల్లోని రెండు రాష్ట్రాల సాయుధ పోలీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి, శిబిరాలకు తరలించాలని నిర్ణయించాయి. ఒప్పందం ప్రకారం దెస్సొయ్ లోయ అభయారణ్యంలోని వివాదాస్పద స్థలాల్లోని సాయుధ పోలీసులను 24 గంటల్లో పూర్తిగా ఉపసంహరించుకుంటారు. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్‌ల ద్వారా, ఉపగ్రహ ఛాయా చిత్రాలతో యథాతథస్థితిని కొనసాగించేందుకు కృషి చేస్తాయి. ఈ ఒప్పందంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హర్షం వ్యక్తంచేశారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియు రియోకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
మిజోరం రాష్ట్రంలో తనపై కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలపై అస్సాం సీఎం బిశ్వశర్మ స్పందించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. అదే సమయంలో రాజ్యాంగ పరంగా మిజోరం భూభాగంలో జరిగిన ఘర్షణపై విచారణను తటస్థ సంస్థకు ఎందుకు అప్పజెప్పడం లేదని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని మిజోరం ముఖ్యమంత్రి జొరాంథాంగాకు తెలిపానని అన్నారు. ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందిన ఘటనకు సంబంధించి.. మిజోరంలోని కొలాసిబ్ అధికారులు ఆరుగురిపై అస్సాంలోని కచార్ జిల్లా అధికారులు కేసు నమోదు చేసి, సమన్లు జారీ చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి.
వాహన రాకపోకలు బంద్
జులై 26వ తేదీన సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకున్న రోజు నుంచి అస్సాం నుంచి ఒక్క ట్రక్కు కూడా రాష్ట్రంలోకి రాలేదని మిజోరం అధికారులు తెలిపారు. మిజోరంలో ముఖ్యమైన 306వ నెంబర్ జాతీయ రహదారిపై అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో దిగ్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సోమవారం నుంచి శనివారం వరకు అస్సాం నుంచి మిజోరం రాష్ట్రానికి ఒక్క వాహనం కూడా రాలేదని కొలాసిబ్ డిప్యూటీ కమిషనర్ హెచ్ లాల్తాంగ్లియానా ఉద్ఘాటించారు. అస్సాం మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
అసలు వివాదం ఏంటి?
19వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు ఈశాన్య ప్రాంతం ఆక్రమణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల ఆధ్వర్యంలో ఉండే భూభాగాలను ఆక్రమించుకోడానికి అక్కడి ప్రాంతాల పరిపాలనకు అస్సాంను కేంద్రంగా చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈశాన్య ప్రాంతాలు అస్సాంలో భాగంగానే ఉండేవి. అనంతరం నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అస్సాం నుంచి విడిపోయాయి. అయితే సరిహద్దుల విభజన మాత్రం అప్పట్లో సరిగా జరగలేదనే వాదన వినిపిస్తునే ఉంది. దీనిపై ఈ నాలుగు కొత్త రాష్ట్రాలు ముందు నుంచి అసంతృప్తితోనే ఉన్నాయి.
ఈ సరిహద్దు వివాదాలు చినికి చినికి పెద్దవి కావడానికి ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులేనని నిపుణులు అంటున్నారు. అస్సాం నుంచి విడిపోయిన నాలుగు రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగా సరిహద్దులు నిర్దేశించుకున్నాయి. అయినా చారిత్రకంగా తమ సొంత భూములను కోల్పోయామనే భావన నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ వాసుల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో తమ వనరులు కోల్పోవడానికి సిద్ధంగా లేని రాష్ట్రాలు, సరిహద్ధుల్లోని భూభాగాలపై హక్కులు కోసం ప్రయత్నిస్తునే ఉన్నాయి.
అస్సాం-మిజోరాం సరిహద్దుల్లో సమస్యలు గతంలో సైతం హింసకు దారితీశాయి. నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లతో ఉన్న అస్సాం సరిహద్దుల్లో కూడా ఘర్షణలు తలెత్తాయి. ఇలాంటి వివాదాలను పరిష్కరించడానికి గతంలో ఏర్పాటు చేసిన సరిహద్దు కమీషన్ల వల్ల ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. కమీషన్లు ప్రతిపాదించిన సిఫార్సులను ఆయా రాష్ట్రాలు అంగీకరించడానికి సిద్ధంగాలేవు.