సీఎంను కలిసేందుకు ఆరాటం..


అసోంలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. సిల్చార్‌లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 
ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ ఇక్కడి పరిస్థితుల్ని సమీక్షించేందుకు వచ్చారు. వరద బాధితుల్ని పరామర్శించారు. ఈ సమయంలోనే ఓ ఆసక్తికర ఘటన జరిగింది. బిశ్వంత్ శర్మ పడవలో పర్యటిస్తుండగా ఓ వ్యక్తి ఆయనను కలిసేందుకు తెగ ఆరాటపడిపోయాడు. నడుములోతు నీళ్లో ఉన్నా చాలా కష్టంగానే సీఎం వద్దకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అతని కష్టాన్ని అర్థం చేసుకున్న అధికారులు వెంటనే పడవలో నుంచి కిందకు దిగారు. అతనికి సహాయం అందించి సీఎం వద్దకు తీసుకొచ్చారు. సీఎంను దగ్గర నుంచి చూసి తెగ మురిసిపోయాడా వ్యక్తి. 






సీఎంకు గముసాను బహుకరించిన వ్యక్తి..


తమకు ఈ కష్టకాలంలో సిబ్బంది ఎంతో సహకరించిందన్న ఆ వ్యక్తి, అసోం సంప్రదాయ దుస్తులైన గముసా (Gamusa)ను సీఎంకు బహుకరించారు. ఇది అందుకున్న బిశ్వంత్ శర్మ "ఎప్పుడైనా ఓసారి మీ ఇంటికి వస్తాను. ఛాయ్ తాగి వెళ్తాను" అని హామీ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. అసోంలో సిల్చార్ జిల్లా వరదలకు అతలాకుతలమైంది. ఇప్పటికీ అక్కడ వరద నీరు పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటి వరకూ వరదల కారణంగా 121 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. 25 జిల్లాల్లో దాదాపు పాతిక లక్షల మంది ప్రజలపై వరద ప్రభావం పడింది. సిల్చార్‌లో డ్రోన్‌ల ద్వారా ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో పరిస్థితులు సమీక్షించిన సీఎం బిశ్వంత్ శర్మ, వీలైనంత త్వరగా విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. మరో 24 గంటల పాటు వర్షాలు కురవకపోతే సిల్చార్ జిల్లా ప్రజలు కాస్త కుదుట పడవచ్చని అంటున్నారు. 


నగావ్ జిల్లాలోని ప్రజల కష్టాలు మరీ దారుణంగా ఉన్నాయి. నేషనల్ హైవేలపైనే గుడారాలు వేసుకుని ఉండాల్సి వస్తోంది. చాలా మంది బాధితులు ఇలా జాతీయ రహదారులపైనే షెల్టర్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రహా అసెంబ్లీ నియోజకవర్గంలోని 155 గ్రామాల్లో లక్షన్నర మందిపై వరద ప్రభావం పడినట్టు అధికారులు చెబుతున్నారు. కేంద్ర మంత్రి సర్బనంద సోనోవాల్ ఇటీవలే వరద శిబిరాల్ని సందర్శించి... సహాయక చర్యల్ని సమీక్షించినట్టు అధికారులు వెల్లడించారు.