Bangladeshi Muslims: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బంగ్లాదేశ్ ముస్లింలను గుర్తించేందుకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని తేల్చి చెప్పారు. బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్ ముస్లింలను "Miya"గా పిలుస్తారు. వీళ్లను స్థానికులుగానే గుర్తించాలన్న డిమాండ్ ఉంది. అయితే..ఇటీవల పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సమయంలోనే ఆయన ఈ ముస్లింల గురించి ప్రస్తావించడం కీలకంగా మారింది. మియా వర్గానికి చెందిన ముస్లింలకు గుర్తింపు రావాలంటే వాళ్ల సంస్కృతి, సంప్రదాయాల్ని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు హిమంత బిశ్వశర్మ. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ సంతానం ఉండడం, బహుభార్యత్వం, మైనర్ బాలికలకు పెళ్లిళ్లు చేయడం లాంటి ఆచారాలను పాటించకుండా ఉన్న వాళ్లకే ప్రభుత్వం తరపున అధికారిక గుర్తింపు లభిస్తుందని వెల్లడించారు. 


"మియా వర్గానికి చెందిన వాళ్లు స్థానికులా లేదా స్థానికేతరులూ అన్న వాదన పక్కన పెట్టేద్దాం. వాళ్లను స్థానికులుగానే గుర్తించడానికి మాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ అందుకోసం వాళ్లు కొన్ని ఆచారాలు వదులుకోవాల్సి ఉంటుంది. బాల్య వివాహాలు, బహుభార్యత్వాన్ని పక్కన పెట్టేయాలి. మహిళలు చదువుకునేలా ప్రోత్సహించాలి. ఈ నిబంధనలు పాటిస్తే కచ్చితంగా వాళ్లకు గుర్తింపు లభిస్తుంది"


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి


అసోం సంస్కృతిని గౌరవించుకోవాల్సిన అవసరాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేశారు హిమంత బిశ్వ శర్మ. వైష్ణవుల సత్రాలను కొన్ని చోట్ల ఆక్రమించేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మియా వర్గానికి పౌరసత్వం కల్పించడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని..కానీ వాళ్లు ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం మాత్రం కుదరదని వెల్లడించారు. ఇక్కడి ప్రజల సంప్రదాయాల్ని గౌరవించనప్పుడు వాళ్లను స్థానికులుగా ఎలా గుర్తిస్తామని ప్రశ్నించారు. అంతే కాదు. ముస్లింలు తమ పిల్లల్ని మదర్సాలకు పంపడానికి బదులు స్కూల్స్, కాలేజ్‌లకు పంపాలని సూచించారు. అమ్మాయిలంతా కచ్చితంగా చదువుకోవాలని అన్నారు. బాల్య వివాహాలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది నుంచి అసోం ప్రభుత్వం బాల్య వివాహాలపై దృష్టి పెట్టింది. గతేడాది ఫిబ్రవరిలో 3,483 మందిని అరెస్ట్ చేసింది. 4,515 కేసులు నమోదు చేసింది. అంతకు ముందు కూడా మియా ముస్లింల గురించి ప్రస్తావించారు హిమంత. మరో పదేళ్ల వరకూ బీజేపీకి వాళ్లు ఓటు వేయాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాల లాంటి ఆచారాలకు దూరంగా ఉంటేనే తమకు ఓటు వేయాలని వెల్లడించారు. 


ఎవరీ మియాలు..?


1971 కి ముందు బంగ్లాదేశ్‌ని తూర్పు పాకిస్థాన్‌గా పరిగణించే వాళ్లు. ఇక్కడి ముస్లింలు క్రమంగా అసోంకి వలస వచ్చారు. వీళ్లు బెంగాలీ మాట్లాడతారు. అసోంలో 30 నియోజకవర్గాల్లో ఎన్నికల్ని శాసించగలరు. అయితే...ముస్లింలతో పాటు కొందరు హిందువులు కూడా ఉన్నారు. వీళ్లంతా బెంగాలీ మాట్లాడడం వల్ల స్థానికుల్లో కలిసిపోయారు. వీళ్లని సెటిలర్స్‌గా పరిగణిస్తున్నారు. అసోంకి చెందిన ముస్లింల ఓటు బ్యాంకుని పోగొట్టుకోకుండా ఉండేందుకు ఈ మియా ముస్లింల గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. 2022లో అసోంలోని ముస్లింలందరినీ స్థానికులుగా గుర్తించింది ప్రభుత్వం. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం ఈ గుర్తింపు ఇవ్వలేదు.