Himanta Biswa on Madrasas:



సంకల్ప యాత్రలో వ్యాఖ్యలు..


అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని అన్ని మదర్సాలనూ మూసివేస్తానని తేల్చి చెప్పారు. చాన్నాళ్ల క్రితమే ఈ హామీ ఇచ్చిన హిమంత...ఇకపై అమలు చేస్తామని స్పష్టం చేశారు. పిల్లలందరూ స్కూల్స్, కాలేజీల్లో చదువుకోవాలని అనుకుంటున్నారని అన్నారు.  కర్ణాటకలోని బెలగవిలో విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరి కొద్ది రోజుల్లోనే కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే బీజేపీ ఇక్కడ చాలా యాక్టివ్‌గా ప్రచారం చేస్తోంది. ఈ కార్యక్రమంలోనే హిమంత బిశ్వ శర్మ ఈ హామీ ఇచ్చారు. 


"నేను సీఎం అయ్యాక దాదాపు 600 మదర్సాలను మూసేశాం. మిగతా వాటినీ మూసేందుకు ప్రయత్నిస్తున్నాం. మనకు ప్రస్తుతానికి మదర్సాల అవసరం లేదు. మనకు కావాల్సింది స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు"


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి


2020లో హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోంలోని మదర్సాలన్నింటినీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. వాటినే స్కూల్స్‌లా మార్చారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చారు. ఈ ఏడాది జనవరి నాటికి చూస్తే..అసోంలో 3 వేల మదర్సాలున్నాయి. ఈ మదర్సాలు ఉండటం వల్లే కొందరు పొరుగు దేశాల నుంచి వచ్చి ఇక్కడ కుట్రలు చేస్తున్నారని అన్నారు శర్మ. ఇలాంటి అక్రమ వలస దారులను అడ్డుకోటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలపైనా విమర్శలు చేశారు. మొఘల్స్‌కు అనుకూలంగా ఉన్న చరిత్రను మాత్రమే కాంగ్రెస్ విశ్వసిస్తోందని అన్నారు. భారత్  చరిత్రను బాబర్, ఔరంగజేబు, షాజహాన్‌తో మాత్రమే ముడి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ భారత్‌ చరిత్ర అంటే మొఘల్స్‌ కాదని, ఛత్రపతి శివాజీ, గురు గోవింద్ సింగ్, స్వామి వివేకానంద అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను మొఘల్స్‌తో పోల్చారు హిమంత బిశ్వ శర్మ. 


"కాంగ్రెస్ పార్టీ మొఘల్‌గా మారుతోంది. దేశాన్ని బలహీన పరిచాలని కుట్ర చేస్తోంది. బాబ్రీ మసీదుకు అనుకూలంగా నిలబ్డడారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించారు. బీజేపీ ఎప్పుడూ ఆలయాల నిర్మాణానికే కట్టుబడి ఉంటుంది. వాటిని కూల్చే ఆలోచనలు మాకు రావు. గతంలో ఢిల్లీ పాలకులు ఆలయాలను ఎలా కూల్చాలంటూ చర్చలు పెట్టుకునే వాళ్లు. కానీ ప్రధాని మోదీ హయాంలో ఆలయాల నిర్మాణం గురించి చర్చ జరుగుతోంది. ఇది నవభారతం. ఈ శక్తిని బలహీన పరిచాలన్నదే కాంగ్రెల్ లక్ష్యం. ముస్లింలు, క్రిస్టియన్‌లు తమ మతం గురించి గొప్పగా చెప్పుకుంటారు. హిందువులు కూడా అదే విధంగా నేను హిందువును అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలి"


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి