Ashok Gehlot On Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే చేపట్టారు. అయితే అదే సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించడం కేవలం రాహుల్ గాంధీ వల్లే సాధ్యమవుతుందని గహ్లోత్ అన్నారు.
రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే ఆయన మాత్రమే మోదీని, భాజపా ప్రభుత్వాన్ని సవాల్ చేయగలరు. అయితే గాంధీయేతర వ్యక్తి పార్టీ అధ్యక్షుడవ్వాలనేది రాహుల్ గాంధీ కోరిక. అందుకే ఇది సాధ్యమైంది. ఈ రోజు మా పార్టీకి సరికొత్త ఉషోదయం. మల్లికార్జున్ ఖర్గేను మేం అభినందిస్తున్నాం. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. - అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
ఖర్గే ప్రమాణం
మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. సోనియా గాంధీ అధికారికంగా తన బాధ్యతలను ఖర్గేకు అప్పగించారు. ఖర్గే ఆధ్వర్యంలో పార్టీ ముందుకెళ్తుందని ఆకాంక్షించారు. ప్రమాణస్వీకారం చేశాక ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ క్షణం నేనెంతో భావోద్వేగానికి గురవుతున్నాను. ఓ సాధారణ కార్మికుడి కొడుకుని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడటం నా ప్రధాన బాధ్యత. అంతే కాదు. రాజకీయాల్లో "త్యాగం" గురించి మాట్లాడాలంటే ముందుగా సోనియా గాంధీ గురించే చెప్పాలి. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ఎంతో పురోగతి సాధించింది. ప్రస్తుతం పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో మార్పులు తెచ్చేందుకు శ్రమిస్తున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచింది. ఈ విద్వేషాలు, అబద్ధాలు, మోసాలను ఛేదించి తీరతాం. 137 ఏళ్లుగా కాంగ్రెస్ చరిత్ర ప్రజలతోనే ముడి పడి ఉంది. పార్టీలో యువతకు ప్రాధాన్యతనివ్వడంపై దృష్టి సారిస్తున్నాం. - మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఖర్గే ప్రమాణ స్వీకారం తర్వాత సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంచార్జ్‌లు తమ రాజీనామాలను కాంగ్రెస్ అధ్యక్షుడికి అందజేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
Also Read: Guinness World Record: వారెవ్వా, ఒక్క కోన్‌పై 125 ఐస్ స్కూప్‌లు- గిన్నిస్ రికార్డ్!