Kejriwal Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్‌ అయి బెయిల్‌పై విడుదలైన అరవింద్ కేజ్రీవాల్‌ బెయిల్ గడువు జూన్ 1వ తేదీతో ముగియనుంది. అయితే మరో వారం రోజుల పాటు బెయిల్‌ని పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ని విచారించేందుకు కోర్టు అంగీకరించలేదు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ ఈ పిటిషన్‌ని తిరస్కరించారు. ట్రయల్ కోర్టులోనే బెయిల్ పిటిషన్ పెట్టుకోవాలని తేల్చి చెప్పారు. వైద్య కారణాలు చెప్పి బెయిల్‌ని పొడిగించాలని అడిగినా అది కుదరదని స్పష్టం చేశారు. మునుపటితో పోల్చుకుంటే ఆరోగ్యం మరింత క్షీణించిన కారణంగా వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరముందని, ఎక్కువ రోజుల పాటు జైల్‌లో ఉండకుండా జాగ్రత్త పడుతున్నామని సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్‌పై బయట ఉండడం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించారు. అలా అని చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్టు అవ్వదని అభిప్రాయపడ్డారు. కానీ..కోర్టు ఈ వాదనని అంగీకరించలేదు. 






ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అంటూ ఇప్పటికే ఈడీ తేల్చి చెప్పింది. రౌజ్ అవెన్యూ కోర్టులో ఇదే స్పష్టం చేసింది. లిక్కర్ లైసెన్స్‌లు ఇచ్చేందుకు భారీగా ముడుపులు పొందినట్టు ఆరోపించింది. దాదాపు రూ.100 కోట్ల లంచం తీసుకుని, ఆ డబ్బునే గోవా, పంజాబ్ ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్టు వెల్లడించింది. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి అనుమతినివ్వాలని కోరుతూ అంతకు ముందు కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని సవాల్ చేస్తూ ఈడీ కూడా పిటిషన్ వేసింది. అయితే...వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేజ్రీవాల్‌కి బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1వ తేదీన వరకూ బెయిల్ ఇచ్చింది. జూన్ 2వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడీకి తిరిగి లొంగిపోవాలని తేల్చి చెప్పింది. 


ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇదంతా కుట్ర అని ఆప్‌ కొట్టి పారేస్తున్నప్పటికీ కీలక నేతలు మాత్రం బీజేపీ సీనియర్ నేతలంతా కేజ్రీవాల్‌ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చినంత మాత్రాన కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదని తేల్చి చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతే పునాది అని అమిత్ షా ఆరోపించారు. అయితే...కేజ్రీవాల్‌ బీజేపీ వైఖరిపై మండి పడుతున్నారు. ఆ మధ్య ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌ని ముట్టడించేందుకూ ప్రయత్నించారు. ఆ తరవాత స్వాతి మలివాల్ కేసు కూడా వెంటాడడం వల్ల పొలిటికల్‌గా ఆప్ పార్టీకి మరో సవాలు ఎదురైంది. 


Also Read: Rafah News: సెలెబ్రిటీలు షేర్ చేస్తున్న ఈ రఫా ఫొటో నిజం కాదా, AIతో క్రియేట్ చేశారా? అసలు కథ ఇదే