Isarel Attack on Rafah: రఫాపై ఇజ్రాయేల్ దాడి చేసినప్పటి నుంచి (Attack on Rafah) సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. 45 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే All Eyes on Rafah పేరిట ఓ ఇమేజ్‌ విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది ప్రముఖులు ఇదే ఫొటోని షేర్ చేస్తూ రఫా పౌరులకు మద్దతు పలుకుతున్నారు. క్రమంగా ఇదో ఉద్యమంగా మారింది. పలు మానవతావాద సంస్థలూ పెద్ద ఎత్తున ఈ క్యాంపెయిన్‌ చేపడుతున్నాయి. రఫాలో శరణార్థుల శిబిరాల్లో ఉన్న వాళ్లపై దాడులు చేస్తున్నారంటూ మండి పడుతున్నాయి. వాళ్లకి చికిత్స అందించేందుకూ వీల్లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. గాజాలో జరుగుతున్నది అందరూ కళ్లు తెరిచి చూడాలంటూ #AllEyesonRafah హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఈ ఇమేజ్‌ ఎక్కడిది..? మొదట ఎవరు క్రియేట్ చేశారన్న చర్చ మొదలైంది. ఈ ఇమేజ్‌ని AIతో క్రియేట్ చేశారని కొందరు వాదిస్తుంటే...మరికొందరు ఇది నిజమే అని వాదిస్తున్నారు. కొంత మంది ఎక్స్‌పర్ట్‌లు మాత్రం ఇది కచ్చితంగా AI తో క్రియేట్ చేసిందే అని తేల్చి చెబుతున్నారు. క్యాంప్‌లోని టెంట్‌లను ఇంత పద్ధతిగా అరేంజ్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. 


ఇక ఈ స్లోగన్‌ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే పాలస్తీనా ఆక్రమిత భూభాగంలోని WHO డైరెక్టర్ రిక్‌ పీపర్‌కార్న్ మొట్ట మొదట ఈ నినాదం వినిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రఫాపై కీలక ప్రకటన చేశారు. ఆ ప్రాంతంపై దాడులకు సమాయత్తమవుతున్నట్టు వెల్లడించారు. ఆ సమయంలోనే రిక్‌ పీపర్‌కార్న్ అందరి చూపూ రఫాపైనే అని అన్నారు. ఇప్పుడదే నినాదం ట్రెండ్ అవుతోంది. చిన్నారుల హక్కుల్ని రక్షించే సంస్థలు కూడా ఇదే నినాదంతో ప్రచారం చేస్తున్నాయి. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో లక్షలాది పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌స్టాలో ఇదే ట్రెండ్ అవుతోంది. పోస్ట్ చేసిన 24 గంటల్లోనే దాదాపు 3 కోట్ల మంది ఇన్‌స్టాలో షేర్ చేశారు. 


గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడి చేశారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ఉద్ధృతమవుతోంది. ఇజ్రాయేల్ పౌరుల్ని హమాస్ ఉగ్రవాదులు బంధించారు. ఆ శరణార్థులను విడిపించేందుకు హమాస్‌తో ఇజ్రాయేల్ సంప్రదింపులు జరుపుతోంది. విడతల వారీగా వాళ్లని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొంత మందిని విడుదల చేశారు కూడా. అయితే...యుద్ధ తీవ్రత మాత్రం అసలు తగ్గడం లేదు. రఫాలో హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నారన్న కారణాన్ని చూపించిన ఇజ్రాయేల్‌ ఆ ప్రాంతంపై దాడి చేస్తామని ముందే హెచ్చరించింది. అప్పటి నుంచి ఈజిప్ట్‌ ఇజ్రాయేల్‌తో చర్చలు జరుపుతోంది. దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని తేల్చి చెప్పింది. ఈ హెచ్చరికల్నీ పట్టించుకోకుండా రఫాపై దాడి చేసింది ఇజ్రాయేల్. ఇటీవల జరిగిన దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: Viral Video: లోకల్ ట్రైన్‌లో యువతి అశ్లీల నృత్యాలు, వీడియోలు వైరల్ - స్పందించిన రైల్వే