Arvind Kejriwal Arrest Updates: అరెస్ట్‌ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టుని కోరారు. ఈడీ కస్టడీ అక్రమం అంటూ అందులో ప్రస్తావించారు. తక్షణమే తనను విడుదల చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మార్చి 24వ తేదీన విచారణ జరపాలని కోరారు. ఈడీ కస్టడీలోకి తీసుకోకుండా కేజ్రీవాల్ ప్రయత్నించినప్పటికీ రౌజ్ అవెన్యూ కోర్టు మాత్రం షాక్ ఇచ్చింది. ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నెల 28వ తేదీ వరకూ కస్టడీలో ఉంచేందుకు అంగీకరించింది. ముందు తీర్పుని రిజర్వ్‌లో ఉంచిన కోర్టు..ఆ తరవాత ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. దీన్ని సవాల్ చేస్తూనే ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. అరెస్ట్‌తో పాటు ఆయన రిమాండ్ ఆర్డర్‌నీ సవాల్ చేశారు.
లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు మార్చి 21న అరెస్ట్ చేశారు. ఆరు రోజుల రిమాండ్‌కి తరలించారు. ఈ రిమాండ్‌నీ కేజ్రీవాల్ సవాల్ చేస్తున్నారు. తన అరెస్ట్ కూడా అక్రమం అని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతానికి కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి...కేజ్రీవాల్ తన అరెస్ట్‌ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కానీ...అంతలోనే ఆయన ఆ పిటిషన్‌ని ఉపసంహరించుకున్నారు. హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన లాయర్‌లు వెల్లడించారు. అరెస్ట్ అయినా జైల్‌లో నుంచే పరిపాలిస్తానని కేజ్రీవాల్ ప్రకటించారు. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. గ్యాంగ్‌స్టర్‌లు మాత్రమే ఇలా ఆలోచిస్తారంటూ మండి పడింది. ఇక కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఓ వీడియో విడుదల చేశారు.
జైల్‌లో నుంచి సందేశం..
జైల్‌లో కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల్ని ఉద్దేశించి ఇచ్చిన సందేశాన్ని చదివి వినిపించారు. తాను ఎక్కడ ఉన్నా దేశానికే జీవితం అంకితం చేస్తానని కేజ్రీవాల్ చెప్పినట్టు ఆమె వెల్లడించారు. కొన్ని సంక్షేమ పథకాల్ని అమలు చేయలేకపోతున్నందుకు ఆయన విచారం వ్యక్తం చేసినట్టు చెప్పారు. త్వరలోనే బయటకు వస్తానన్న ధీమాతో ఉన్నట్టు వివరించారు. ఇదంతా మోదీ సర్కార్ కుట్రేనని సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండి పడ్డారు. ప్రతిపక్షాల్ని అణిచివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.