ఏ దేశంలో అయినా వారి జాతిపితగా ప్రకటించుకున్న వారిని ఎవరూ వివాదాల్లోకి తీసుకు రారు. వారి కాలంలో వారు తీసుకున్న నిర్ణయాలు తమకు నచ్చకపోతే ఇప్పుడు చరిత్రను మార్చే ప్రయత్నం చేయరు. జాతిపతగా భారతీయులు ప్రకటించుకుని 70 ఏళ్ల పాటు గొప్పగా చెప్పుకున్న మహాత్మునిపై మాత్రం తరచూ వివాదాలు వసతున్నాయి.  ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో ఎవరికీ తెలియని అంశాల్లో గాంధీ పాత్రను విశ్లేషిస్తున్నారు. ఎవరో ఇలా చేస్తే ఇలా పట్టించుకునేవారు కాదు. కానీ కేంద్రంలో అధికారలో ఉన్న వారే ఇలా చేస్తూండటంతో తరచూ వివాదాలు రేగుతున్నాయి. తాజాగా రక్షణ మంత్రి రాజ్  నాథ్ సింగ్ గాంధీ మహాత్ముడిని వివాదంలోకి తెచ్చారు.  


వీర్ సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్లు గాంధీ సూచనలతోనే వేశారన్న రాజ్‌నాథ్ సింగ్ ! 


మూడు రోజుల కిందట వీర్ సావర్కర్‌ జీవితంపై రాసిన ఓ పుస్తకాన్ని రాజ్ నాథ్ సింగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా  ఆయన ప్రసంగించారు. వీర్‌ సావర్కర్‌ స్వాతంత్ర్య సమరయోధుడని.. అయితే ఆయన గురించి అసత్యాలు ప్రచారంలో ఉన్నాయన్నారు. జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఎన్నో క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారని...అవన్నీ మహాత్మా గాంధీ సూచనల మేరకే  రాశారని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.  మార్క్సిస్ట్‌, లెనినిస్ట్‌ భావజాలం కలిగిన వ్యక్తులే ఆయనను నియంతృత్వవాది అని   వక్రీకరించారని ఆరోపించారు. వీర్ సావర్కర్‌ను 20వ శతాబ్దంలో భారతదేశపు తొలి సైనిక వ్యూహకర్తగా అభివర్ణించారు.




Also Read : దగా.. దగా.. మోసం! ఇంట్లో ఉన్నది ఐదుగురు.. పడింది మాత్రం ఒకే ఒక్క ఓటు!



రాజ్‌నాథ్‌పై విపక్ష పార్టీల ఆగ్రహం ! 


కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రను వక్రీకరించేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారని ఇదే కొనసాగితే జాతిపితగా మహాత్మగాంధీని తొలగించి.. ఆ స్థానంలో సావర్కర్‌ను ప్రకటిస్తారని మజ్లిస్ అధినేత ఓవైసీ ఆరోపించారు. మహాత్మా గాంధీ హత్యకేసులో నిందితుడిగా ఉన్న సావర్కర్‌ను కేంద్ర మంత్రి పొగడటం దురదృష్టకరమన్నారు. జస్టిస్ జీవన్‌లాల్ కపూర్ కమిటీ కూడా ఇదే తేల్చిందని చెప్పారు. బీజేపీ నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలు.. జాతి మొత్తాన్నీ తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఓవైసీ ఆరోపిస్తున్నారు.


Also Read: Malabar Maritime Exercise Pics: చైనాకు భారత్ చెక్.. 'ఆపరేషన్ మలబార్‌'తో డ్రాగన్ గుండెల్లో గుబులు


చరిత్రను బీజేపీ పెద్దలు వక్రీకరిస్తున్నారా ? 


1911లో వీర్ సావర్కర్‌కు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం జీవిత ఖైదు విధించింది. బ్రిటీష్‌ అధికారి హత్య కేసులో ఆయన పాత్ర ఉందని శిక్ష విధించారు. దీంతో పన్నెండేళ్ల పాటు కాలాపానీ జైల్లో గడిపారు. తనకు క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్‌ అధికారులకు సావర్కర్‌ లేఖలు రాశారు. గాంధీ హత్య కేసులో ప్రమేయం ఉందనే ఆరోపణలపై 1949లో సావర్కర్‌ అరెస్టయ్యారు.  ఆధారాలు లభించకపోవడంతో విడుదలయ్యారు. నిజానికి సావర్కర్ తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాసే సమయానికి మహాత్మాగాంధీ ఇంకా ఇండియాకు రాలేదు. 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చారు. ఈ విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. రాజ్‌నాథ్ సింగ్ చరిత్రను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.




Also Read: GatiShakti Launch: రూ.100 లక్షల కోట్లతో 'పీఎం గతి శక్తి'కి మోదీ శ్రీకారం.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సెటైర్లు


మహాత్మునిపై బీజేపీ నేతల విమర్శలు ఇదే మొదటిసారి కాదు !


భారతీయ జనతా పార్టీ నేతలు ఎంతో మంది మహాత్మునిపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు. దేశ విభజనకు మహాత్ముడు కారణం అని నమ్ముతూ ఉంటారు. సాధ్వీ ప్రజ్ఞాసింగ్, ఉమాభారతి సహా అనేక మంది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిపై బీజేపీ హైకమాండ్ ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు. గాంధీ వర్థంతిని ఆర్‌ఎస్ఎస్ మద్దతు ఉన్న కొన్ని సంఘాలు శౌర్య దివస్‌గా పాటిస్తూ ఉటాయి. నాథూరాం గాడ్సేకున నివాళులు అర్పిస్తూ ఉంటారు.  లోక్‌సభలో జరిగిన ఓ చర్చలో గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ ప్రసంగించారు ఎంపీ  ప్రజ్ఞాసింగ్. ఆమెపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రాజ్ నాథ్ వ్యాఖ్యలతో మరోసారి దుమారం ప్రారంభమయింది. ఇప్పుడు సావర్కర్‌నూ ఈ అంశంలో గాంధీ కన్నా గొప్పగా చిత్రీకరించడం వివాదాస్పదమవుతోంది. 


Also Read:Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి