శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా.. ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మహా సముద్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇంటెన్స్ లవ్, ఎమోషన్స్‌తో పాటు మాస్‌ను మెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. దీంతోపాటు పాటలు కూడా సూపర్ హిట్ కావడంతో.. మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? శర్వానంద్ హిట్ కొట్టాడా? తెలుగులో సిద్ధార్థ్‌కు మంచి కమ్‌బ్యాక్ లభించిందా?


కథ: వైజాగ్‌లో ఉండే అర్జున్ (శర్వానంద్), విజయ్(సిద్ధార్థ్) ప్రాణస్నేహితులు. పోలీస్ జాబ్ కొట్టాలనేది విజయ్ కల అయితే.. చిన్న బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేసి.. సొంత కాళ్ల మీద నిలబడాలనేది అర్జున్ కోరిక. మహా(అదితిరావు హైదరి), విజయ్ ప్రేమించుకుంటూ ఉంటారు. ఇక అర్జున్(శర్వానంద్), మొదటి చూపులోనే స్మిత(అను ఇమ్మాన్యుయెల్)ని ఇష్టపడతాడు. అయితే ఒక్క అనుకోని సంఘటన వీరందరి జీవితాలను తలకిందులు చేస్తుంది. అసలు ఆ సంఘటన ఏంటి? విజయ్ ఎందుకు పోలీసాఫీసర్ అవ్వాలనుకున్నాడు? వీరి కథలతో ధనుంజయ్(గరుడ రామ్), గూని బాబ్జీ(రావు రమేష్), చుంచు మామ(జగపతి బాబు)లకు ఏం సంబంధం? చివరికి వీరి జీవితాలు ఎటు వెళ్లాయి? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..


దర్శకుడు అజయ్ భూపతి రాసుకున్న కథ అద్భుతంగా ఉన్నా.. కథనం మాత్రం కొన్ని చోట్ల గాడి తప్పింది. దీన్ని లవ్ సినిమాలా నడిపించాలా.. లేకపోతే ప్యాడింగ్ ఉన్న ఆర్టిస్టులు దొరికారు కాబట్టి వారి ఇమేజ్‌కు తగ్గట్లు నడిపించాలా అనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్‌కు లోనైనట్లు తెలుస్తుంది. సినిమా ప్రారంభంలో పాత్రలను పరిచయం చేయడంతో సినిమా కాస్త నిదానంగా సాగుతుంది. కథలో కీలకమైన మలుపు వచ్చాక మాత్రం స్టోరీ పరుగులు పెడుతుంది. ఇంటర్వల్ సీన్ అయితే.. శర్వానంద్ కెరీర్‌లోనే బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అనచ్చు. తర్వాత ద్వితీయార్థంలో కథ మళ్లీ స్లో అవుతుంది. ఇక పతాక సన్నివేశాలు సినిమాకు అతి పెద్ద మైనస్. ప్రీ-క్లైమ్యాక్స్ దాకా ఉన్న టెంపో మొత్తం ఒక్కసారిగా వృథా అయిపోయినట్లు అనిపిస్తుంది. ఎలా ముగించాలో దర్శకుడికే సరిగా తెలియలేదేమో అనిపిస్తుంది. మొత్తంగా బలమైన పాత్రలు, మంచి కథ రాసుకున్నా.. కథనం సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.


రాజ్ తోట సినిమాటోగ్రఫీ, చేతన్ భరద్వాజ్ సంగీతం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్లు. వైజాగ్‌ను రాజ్ తన కెమెరా కంటితో ఎంతో అందంగా చూపించాడు. ఇక చేతన్ భరద్వాజ్ పాటలు ఇప్పటికే సూపర్ హిట్ కాగా.. నేపథ్య సంగీతం లవ్, ఎమోషనల్ సీన్లను మరింత హృద్యంగా.. యాక్షన్ సన్నివేశాలను మరింత ఇంటెన్స్‌గా మార్చింది. నిర్మాత అనిల్ సుంకర కూడా ఖర్చుకు తగ్గకుండా ఈ సినిమా తెరకెక్కించారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్‌గా కనిపిస్తుంది.


నటీనటుల విషయానికి వస్తే.. శర్వానంద్‌కు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. ప్రస్థానం, రణరంగం, సత్య 2 వంటి సినిమాల్లో తను ఇటువంటి పాత్రలు పోషించాడు. అర్జున్ పాత్రకి శర్వా పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. ఇక సిద్ధార్థ్ ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి మాస్ రోల్ చేయలేదు. లవర్ బాయ్ పాత్రల్లో మనకు తెలిసిన సిద్ధార్థ్‌ను ఇటువంటి పాత్రలో చూడటం కాస్త కొత్తే. ఈ పాత్ర సిద్ధార్థ్ కెరీర్‌కు ఎంత ప్లస్ అవుతుందో చెప్పలేం కానీ.. సిద్థార్థ్ వల్లే ఈ పాత్ర మరో స్థాయికి వెళ్లిందని మాత్రం చెప్పవచ్చు.


అదితిరావు హైదరి మహా పాత్రకు పర్ఫెక్ట్ చాయిస్. కొన్ని సన్నివేశాల్లో తను కళ్లతోనే నటిస్తుంది. చెప్పకే.. చెప్పకే పాటలో తన అభినయం అయితే హైలెట్. తన పాత్ర గురించి ఎంత చెప్పినా స్పాయిలర్సే అవుతాయి. ఇక అను ఇమ్మాన్యుయెల్ ఉన్నంతలో బాగానే నటించింది. గూని బాబ్జీ పాత్రలో రావు రమేష్, చుంచు మామ పాత్రలో జగపతిబాబు జీవించారు. ఈ మధ్యకాలంలో జగపతిబాబు ఇంత హుషారైన పాత్ర చేయలేదు.


ఓవరాల్‌గా చూస్తే.. ఒక బలమైన కథను.. బలహీనమైన సన్నివేశాలు మింగేశాయి. సినిమా ఎంత బాగున్నా.. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడిని మెప్పించాల్సింది పతాక సన్నివేశాలే. అవి అద్భుతంగా ఉంటే అంతకు ముందు సినిమా ఎంత నీరసంగా ఉన్నా క్షమించేస్తాడు. అవి బలహీనంగా ఉంటే.. అంతకు ముందు నువ్వు బాహుబలి చూపించినా బలాదూరే అంటాడు. అయితే మహాసముద్రం సినిమా అంతా బాగున్నా.. పతాక సన్నివేశాల్లో దర్శకుడికి క్లారిటీ ఉండి మరోలా రాసుకుని ఉంటే పెద్ద హిట్ అయ్యేది. ఆ ఒక్క విషయం పక్కన బెడితే మిగతా విషయాల్లో మాత్రం మహా సముద్రం అస్సలు నిరాశపరచదు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి