Andhra Pradesh: ఏపీలో పదోతరగతి విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో తమ హాల్‌టికెట్లు చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు, ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా వెళ్ళవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ సూచించింది. 


పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి: మంత్రి బొత్స
మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలతోపాటు పదో తరగతి,  ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలను అధికారులంతా కలిసి సమర్థంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పది, ఇంటర్, ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీసు, వైద్య, రెవెన్యూ, విద్యుత్, తపాలా,  ఆర్టీసీ శాఖల రాష్ట్ర అధికారులతో గురువారం విజయ­వాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.ఆయన మాట్లాడుతూ మార్చి నెల మొత్తం పరీక్షల కాలమని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అధికారులంతా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


ఏపీలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ మార్చి 18 నుంచి 31 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గం. వరకు పదోతరగతి పరీక్షలు నిర్ణయించారు. ఈసారి పదోతరగతి విద్యార్థులకు 7 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్‌, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. పరీక్షల నేపథ్యంలో  ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


పదోతరగతి పరీక్షల షెడ్యూలు..


➥ మార్చి 18: ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1


➥ మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్


➥ మార్చి 20: ఇంగ్లీష్


➥ మార్చి 22: తేదీ మ్యాథమెటిక్స్


➥ మార్చి 23: ఫిజికల్ సైన్స్


➥ మార్చి 26: బయాలజీ 


➥ మార్చి  27: సోషల్ స్టడీస్ పరీక్షలు


➥ మార్చి 28: మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1 


➥ మార్చి 30:  ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష 


'పది' వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు..
ఏపీలోని పదోతరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. విద్యార్థుల పేర్లు, ఇతరత్రా వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. విద్యార్థులు డిసెంబ‌రు 16 నుంచి 20 వరకు వివరాలు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు.. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. బోర్డుకు సమర్పించిన విద్యార్థుల దరఖాస్తుల్లో వివరాలు తప్పుగా ఉంటే సరి చేయాలని సూచించారు. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మాధ్యమం, ఫొటో, సంతకం, మొదటి, రెండో భాష సబ్జెక్టు వివరాలను పరిశీలించాలని ఆయన తెలిపారు. 


టెన్త్  మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...