Weather Warnings: ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేశలో ఇంట్లో నుండి బయట కాలు పెట్టాలంటే జనం జంకుతున్నారు. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో గురు, శుక్ర వారాల్లో వడగాల్పులు తీవ్రంగా ఇబ్బంది పెడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలో 125 మండలాల్లో వడగాల్పులు తీవ్రంగా ఇబ్బంది పెడతాయని హెచ్చరించింది. శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులకు ప్రజలు ఠారెత్తిపోతారని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు తీవ్ర ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పుల కారణంగా ఇంటి నుండి బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్పా పగటి పూట బయటకు రావొద్దని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసేజీలు పంపిస్తున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. 


గురువారం మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్లూరి జిల్లాలోని 7 మండలాల్లో గురువారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అనకాపల్లిలో 15, తూర్పుగోదావరిలో 4, ఏలూరులో 2, గుంటూరులోని 11 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు. కాకినాడలోని 10 మండలాల్లో, కృష్ణాలో 4, ఎన్టీఆర్‌ జిల్లాలో 12, పల్నాడులో 5 మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. పార్వతీపురంమన్యంలో 11, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 23, వైఎస్ఆర్ జిల్లాలో 6 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం అనకాపల్లి 8, విజయనగరంలో ఒక మండలంలో తీవ్ర వడగాల్పులు ఇబ్బంది పెట్టాయి. మరో 93 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.


ఉత్తర తెలంగాణలో నిప్పుల కొలిమే..


నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన నమోదయ్యాయి. గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలంటే భయపడ్డారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు కొంత ఉపశమనం లభించవచ్చని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదుకు అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భుపాలపల్లి,  ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు (30 నుంచి 40 కిలో మీటర్ల వేగం) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఇలా..


‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 42 శాతం నమోదైంది.




ఢిల్లీలో విపరీతమైన ఎండలు


సోమవారం వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని చాలా రాష్ట్రాలు వేడిగాలుల ఉచ్చులో ఉంటాయని అంచనా. IMD ప్రకారం, రాబోయే 4 రోజులు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, దేశంలోని వాయువ్య ప్రాంతంలో రెండు రోజుల పాటు వేడి గాలులు కొనసాగుతాయి.