AP Rains : ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో శనివారం రాత్రి రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో  పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. విస్తారంగా వర్షాలతో పాటుగా పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు పొలాల్లో పనిచేసే కూలీలు, పశు-గొర్రె కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచిచింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. 


నమోదైన వర్షపాతం వివరాలు  


శుక్రవారం ఉదయం  8.30 గం.ల నుంచి శనివారం ఉ.8.30గం.ల వరకు తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో 73.5 మిమీ, బాపట్ల జిల్లా రేపల్లెలో 48.75 మిమీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో  47.25 మిమీ, చిత్తూరు జిల్లా నగరిలో 44.5 మిమీ, నెల్లూరు జిల్లా వింజమూర్ లో 41.5 మిమీ, గుంటూరు జిల్లా  ప్రత్తిపాడులో 26.25 మిమీ,  ప్రకాశం జిల్లా కనిగిరిలో 26.5 మిమీ, వైఎస్సార్ జిల్లా చాపాడులో 24.75 మిమీ వంతున జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. 




పల్నాడు జిల్లా వర్ష బీభత్సం 


పల్నాడుజిల్లాలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నకరికల్లులో గాలి వాన బీభత్సం సృష్టించింది. గాలివాన ధాటికి నార్కట్ పల్లి - అద్దంకి రహదారి డివైడర్ పై కంటైనర్ లారీ బోల్తా పడింది. అదే ప్రాంతంలో రహదారి పక్కనే గాలి దాటికి కోళ్ల ఫారం కుప్పకూలింది.  షెడ్డు పైకప్పు గాలికి ఎగిరిపోయింది. గాలి బీభత్సానికి నకరికల్లు అడ్డరోడ్డు నుంచి మాచర్ల వెళ్లే రహదారిలో భారీ వృక్షం కుప్పకూలింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.  




రేపటి మ్యాచ్ కు వరుణుడి గండం 


 ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను అకాల వర్షాలు, వడగండ్ల వానలు ముంచెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి.  ఏపీలోని పలు జిల్లాలను దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. శనివారం సాయంత్రం  కృష్ణా, ఎన్టీఆర్‌, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏలూరు, గుంటూరులలో వడగండ్ల వాన పడుతోంది. విశాఖలో వర్షం కారణంగా రేపటి మ్యాచ్‌కి అంతరాయం కలగొచ్చని క్రికెట్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విశాఖలో సాయంత్రం కురిసిన వర్షానికి మైదానం తడిసి ముద్దైంది. గ్రౌండ్ ను పరదాలతో  కప్పివేశారు. ఏపీతో పాటు తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది.