Municipal Workers Protests in AP: ఏపీలో కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చేసిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. దీంతో రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమించనున్నారు. అయితే, తాము తాత్కాలికంగా మాత్రమే సమ్మె విరమిస్తున్నట్లు కార్మికులు ప్రకటించాయి. ప్రభుత్వ హామీలకు సంబంధించి జీవోలు విడుదల అయిన వెంటనే పూర్తి స్థాయిలో సమ్మె విరమిస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. కార్మిక సంఘాలతో బుధవారం (జనవరి 10) సాయంత్రం మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. రేపటి నుంచి మున్సిపల్‌ కార్మికులు యధావిధిగా తమ విధులకు కార్మికులు హాజరు కానున్నారు.


వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి దిగారు. అయితే గత చర్చల్లో ప్రభుత్వం వాళ్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించినా.. కొన్ని విషయాలపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో బుధవారం మరోసారి భేటీ అయ్యారు. చివరకు చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించాయి. అయితే, జీవోలు విడుదలయ్యాకే పూర్తి స్థాయి సమ్మె విరమణ ఉంటుందని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.