Prasanth Varma about Vijay: 2024 సంక్రాంతికి ‘గుంటూరు కారం’కు పోటీ ‘హనుమాన్’ మూవీ కూడా విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలు జనవరి 12న థియేటర్లలో పోటీపడడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఇందులో మహేశ్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ తెలుగులో మాత్రమే విడుదల అవుతుండగా.. ‘హనుమాన్’ను మాత్రం తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో మాత్రమే కాకుండా హిందీలో కూడా విడుదల చేస్తున్నారు మేకర్స్. అందుకే ‘హనుమాన్’ టీమ్ మొత్తం ప్రమోషన్స్ కోసం రాష్ట్రాలన్నీ చుట్టేస్తోంది. తాజాగా తమిళంలో ఈ మూవీ ప్రమోషన్స్ చేస్తుండగా.. తమిళంలో సినిమా చేస్తారా అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మకు ప్రశ్న ఎదురయ్యింది. దానికి తను ఆసక్తికర సమాధానం చెప్పాడు.


పెద్ద కలలు కనాలి


‘హనుమాన్’ తమిళ ప్రమోషన్స్ కోసం తమిళనాడుకు వెళ్లారు దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా. ముందుగా తమిళంలో రాఘవ లారెన్స్, సుందర్ సీ వంటి దర్శకులు ‘హనుమాన్’లాంటి జోనర్‌లో సినిమాలు చేయడానికి ఎక్స్‌పర్ట్స్ అయిపోయారని అక్కడి మీడియా గుర్తుచేసుకుంది. ఆ తర్వాత ‘హనుమాన్‌’లాంటి సినిమాను తమిళ హీరోతో తెరకెక్కించాల్సి వస్తే.. ఏ హీరోతో చేస్తారు అని ప్రశాంత్ వర్మకు ప్రశ్న ఎదురయ్యింది. ఇక వారు అడిగిన ప్రశ్నకు ‘దళపతి విజయ్’ అని సమాధానమిచ్చాడు ప్రశాంత్ వర్మ. ఆ సమాధానం విని షాక్ అయిన హీరో తేజ సజ్జా.. ‘‘పెద్ద కలలు కనాలి. అందుకే తను ఈ సినిమా చేశాడు’’ అని నవ్వుతూ చెప్పాడు. ఆపై ప్రశాంత్ వర్మ తన సూపర్ హీరోల యూనివర్స్ గురించి వివరణ ఇచ్చాడు.


ఒక్కొక్క సూపర్ హీరో సినిమా ఒక్కొక్క రాష్ట్రంలో


‘‘మేము తెలుగులో మాత్రమే అనుకొని ఈ సినిమాను ప్రారంభించాం. సూపర్ హీరో సినిమాలతో ఒక యూనివర్స్ సృష్టించబోతున్నాం. ముందుగా హనుమంతుడితో ప్రారంభిస్తున్నాం. ఆ తర్వాత ఇదే యూనివర్స్‌లో ఇంద్రుడు ఉంటాడు, పరశురాముడు ఉంటాడు. అలా ఇతిహాసాల్లో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అవన్నీ మేము తెరపైకి తీసుకురాబోతున్నాం. వచ్చే 10, 15 ఏళ్లకు సరిపడా స్క్రిప్ట్స్ రాసుకున్నాం. ఇది చాలా పెద్ద లక్ష్యం. మీరు ఈ సినిమా వర్క్ అయ్యేలా చేస్తే మా నుంచి ఇంకా ఇలాంటివి ఎన్నో రావడం చూస్తారు. మేము చేయబోయే తరువాత సూపర్ హీరో సినిమా అనేది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించింది కాదు. తమిళనాడుకు సంబంధించింది అయ్యుంటుంది. ఆ తరువాతి సూపర్ హీరోయిన్ సినిమా ఢిల్లీకి సంబంధించినది అయ్యుంటుంది. ఆ తరువాతి సూపర్ హీరో సినిమా నార్త్ ఈస్ట్‌లోని ఒక రాష్ట్రానికి సంబంధించి ఉంటుంది. అలా మేము ఈ యూనివర్స్‌ను బిల్డ్ చేయాలని అనుకుంటున్నాం’’ అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.


అఖండ భారతానికి కథలు చెప్పాలి..


తన సూపర్ హీరో యూనివర్స్ కోసం కేవలం టాలీవుడ్ నుంచి తెలుగు సినిమాలు మాత్రమే కాదని.. ఇండియన్ సినిమాలు చేయాలనుకుంటున్నానని ప్రశాంత్ వర్మ బయటపెట్టాడు. అఖండ భారతానికి తన గొప్ప కథలను చెప్పాలనుకుంటున్నానని అన్నాడు. ఇక ప్రశాంత్ వర్మ మాటలు విన్న తర్వాత నిజంగానే తమిళంలో విజయ్‌తో సినిమా చేస్తాడేమో అని కోలీవుడ్ ప్రేక్షకులు భావిస్తున్నారు. అంతే కాకుండా తను తెరకెక్కించిన ‘హనుమాన్’ హిట్ అయితే.. ఇలాంటి మరెన్నో అద్భుతాలు తన నుంచి వస్తాయని ఇప్పటికీ పలుమార్లు బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ.


Also Read: 'హనుమాన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఏదో తేడా కొడుతుందేంటి?