Kesineni Nani About Chandrababu: సొంత వ్యాపారాల కంటే టీడీపీ కోసమే ఎక్కువగా పని చేశానని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎంతో మంది చెప్పినా పట్టించుకోకుండా, పార్టీలోనే కొనసాగానని కేశినేని నాని తెలిపారు. ఇన్ని రోజులు టీడీపీ కోసం, ప్రజల కోసం ఎంతో చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2 వేల కోట్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పచ్చి మోసగాడు అని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ, జెడ్పీటీసీ, ఎంపిటీసీ,  కార్పోరేషన్, జనరల్ ఎలక్షన్ ల ఖర్చులు తానే భరించినా, అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కేశినేని నాని బుధవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా ఉన్నారు.


అవమానాలు భరించలేకనే కీలక నిర్ణయం.. 
ఏపీ సీఎం జగన్ తో భేటీ ముగిసన అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. టీడీపీకి తన రాజీనామా పొందిన తరువాత వైసీపీలో చేరతానని స్పష్టం చేశారు.  టీడీపీలో ఇంక అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నేతల నుంచి ఎన్ని అవమనాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డానని, చంద్రబాబు పచ్చి మోసగాడు అని ప్రపంచానికి తెలుసు, కానీ ఈ స్థాయిలో మోసం చేస్తాడని ఊహించలేదన్నారు. రాబిన్ శర్మ టీమ్ మన పార్టీకి ఎన్నికల్లో 5 కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పారని.. కానీ ఆ రిపోర్ట్ బయటకు రావొద్దని తనకు సూచించినట్లు కేశినేని నాని వెల్లడించారు. ఓ వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టించి తనను ఉద్దేశపూర్వకంగానే తిట్టించారంటూ మండిపడ్డారు. చెప్పుతో నన్ను కొడతారని ఆ వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేస్తే సైతం పార్టీ నుంచి కనీసం స్పందన లేదన్నారు.


ఎన్నికల భారాన్ని భుజాలపై మోశానన్న కేశినేని.. 
చంద్రబాబు, లోకేష్ పాదయాత్రతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల భారాన్ని తన భుజాలపై మోశానని తెలిపారు. తొమ్మిదిన్నరేళ్లలో పార్టీ పట్ల ఏరోజూ వ్యతిరేకంగా పనిచేయలేదని, చంద్రబాబు జైళ్లో ఉన్న సమయంలో వారి కుటుంబానికి అండగా ఉండానని గుర్తుచేశారు. విజయవాడ డెవలప్ మెంట్ కోసం తాను ఎలాంటి పనికైనా సిద్ధమన్నారు. 2014 నుంచి 2019 వరకు విజయవాడకు అప్పటి సీఎం చంద్రబాబు వంద కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. గుంటూరు, విజయవాడ అభివృద్ది చేస్తే కంపెనీలు వస్తాయని చెబితే.. నీకు ఏం తెలియదంటూ తన నిర్ణయాలకు విలువ ఇవ్వలేదని చెప్పారు. 


ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం మేర టీడీపీ ఖాళీ అయిపోతుందన్నారు. త్వరలోనే నేతలు టీడీపీని వీడి వేరే పార్టీలో చేరడం ఖాయమన్నారు. వైఎస్ జగన్ ని కలిసి కొన్ని విషయాలు చర్చించానని, ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేశినేని నాని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఏ ఎన్నికల్లో నెగ్గని నారా లోకేష్ కు సంబంధించిన కార్యక్రమాల్లో, యువగళం పాదయాత్రలో తాను ఎందుకు పాల్గొనాలని ప్రశ్నించారు. ఒక్కసారైనా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం కూడా లేని లోకేష్ సైతం తనపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ కోసం సొంత ఆస్తులు వేల కోట్లు అమ్ముకుని ఖర్చు చేస్తే చివరికి తనకు అవమనాలే మిగిలాయని, వీటిని భరించలేక టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.