Vibrant Gujarat Summit: 


అభివృద్ధి చెందిన దేశం..


మరో 25 ఏళ్లలో భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నదే తమ లక్ష్యం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. Vibrant Gujarat Global Summit 2024 సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ సదస్సుని ప్రారంభించిన ప్రధాని మోదీ..మౌలిక వసతుల పరంగా భారత్‌ ఎంతో వృద్ధి సాధించిందని వెల్లడించారు. తయారీ రంగంలోనూ గతంతో పోల్చుకుంటే చాలా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. వచ్చే పాతికేళ్లు దేశానికి అమృత్ కాల్‌ అని అన్నారు. 


"ఈ మధ్యే భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఇప్పుడు పూర్తిగా వచ్చే పాతికేళ్లపైనే దృష్టి పెడుతున్నాం. భారత్‌100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. అంటే వచ్చే పాతికేళ్లూ మనకు అమృత్ కాలమే. ఇలాంటి అమృత్ కాలంలో ఇలాంటి సదస్సు జరగడం చాలా సంతోషంగా ఉంది"


- ప్రధాని నరేంద్ర మోదీ




గుజరాత్‌లో అదానీ పెట్టుబడులు..


ఈ సదస్సులో బడా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్లంతా ఆసక్తి చూపించారు. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే అదానీ ప్రకటించారు. అంతే కాదు లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ మరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కాస్త అటు ఇటుగా అయినప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా ఉందని తేల్చి చెప్పారు. గత పదేళ్లలో తాము తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణమని అన్నారు. 


"ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కఠిన సమయంలోనూ భారత్‌ స్థిరంగా నిలబడగలిగింది. పదేళ్లలో మేం చేసిన సంస్కరణలే ఇందుకు కారణం. ఈ సంస్కరణలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచాయి. ఇంత పోటీని తట్టుకుని నిలబడేలా చేశాయి. స్థిరత్వానికి భారత్ మారుపేరుగా ఉంది. విశ్వమిత్రగా మన దేశం దూసుకుపోతోంది"


- ప్రధాని నరేంద్ర మోదీ