Ambedkar Konaseema District: కేజీ బేసిన్‌ పరిధి రికార్డు స్థాయిలో ఆయిల్‌ అండ్ గ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్నట్టు  అధికారులు తెలియజేశారు. దీనికి సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లాడారు ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ రాజమండ్రి అసెట్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ అమిత్ నారాయ‌ణ‌. ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ విభాగానికి సంబంధించి 5 జిల్లాలో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


ఈ ఐదు జిల్లాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, కృష్ణాజిల్లాల్లో ఎక్కువ ఉత్పత్తి సాధించినట్టు అమిత్‌ నారాయణ వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా ఓఎన్జీసీ ఆన్‌షోర్‌లో ఉత్పత్తి అధికంగా ఉందని  పేర్కొన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎస్సార్‌ నిధుల నుంచి మహిళలకు 350 కుట్టు మిషన్లు అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ ఇజ్రాయేల్‌ ద్వారా అందించారు. 


బాగా పెరిగిన ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఉత్పత్తి.. 
రోజుకు 650 టన్నుల చమురు, 21 లక్షల క్యూబిక్‌ మీటర్లు సహజవాయువు ఉత్పత్తి సాధిస్తున్నట్లు అమిత్ నారాయ‌ణ‌ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి రోజుకు 750 టన్నుల ఆయిల్‌ ఉప్పత్తికి పెరిగే అవకాశాలున్నాయని, 23లక్షల క్యూబిక్‌ మీటర్లు గ్యాస్‌ లభించే ఛాన్స్ ఉందన్నారు. ఇందులో ఒక్క అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచే 60 శాతం అయిల్‌ అండ్‌ గ్యాస్‌ లభిస్తోందని, ఈప్రాంతంలోనే మెజారిటీ ఆపరేషన్లు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. తాటిపాక రిఫైనరీ నుంచి అత్యధిక ఉత్పత్తిని చేస్తుండగా నాగాయిలంక నుంచి రికార్డు స్థాయిలో ఆయిల్‌ లభ్యమైనట్లు తెలిపారు. 


డిసెంబర్‌ 25 నుంచి ఇక్కడ రోజుకు 250 టన్నులు ఆయిల్‌ వస్తోందని, ఇదే తరహాలో మల్లేశ్వరం ఫీల్డ్‌లో అత్యాధునిక సాంకేతికతో ప్రయత్నించినప్పుడు అనూహ్యంగా ఉత్పత్తి పెరిగిందన్నారు. ఇక్కడ నుంచి రోజుకు 55 టన్నులు ఆయిల్‌ లభ్యమవుతుందని, ఇక్కడ కూడా మరో 20 రోజుల్లో 150 టన్నులకు మించి ఆయిల్‌ ఉత్పత్తి లభించే అవకాశాలున్నాయన్నారు. 


ఈ కార్యకలాపాల వల్ల ఏడాదికి రూ.600 కోట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఓఎన్జీసీ చెల్లిస్తోందని తెలిపారు. అదేవిధంగా కార్పోరేట్‌ సామాజిక బాద్యత నిధులు(సీఎస్సార్‌) కింద పెద్దఎత్తున ఇస్తున్నామని, ఇవి ఓఎన్జీసీ ఎక్కడైతే కార్యకలాపాలు సాగిస్తుందో ఆ ప్రాంతానికే రూల్స్‌కు అనుగుణంగా ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా విద్య, ప్రజా ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, తాగునీరు, ఆసుపత్రుల్లో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ అందిస్తున్నామన్నారు. 


కోవిడ్‌ సమయంలోనూ భారీ స్థాయిలో ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్స్‌, సిలిండర్లు అందిచామన్నారు. కేవలం ఆయిల్‌, గ్యాస్‌ ఉత్పత్తి సాధనలోనే కాకుండా సీఎస్సార్‌ ఫండ్‌ ఇవ్వడంలోనూ ఓఎన్జీసీ రాజమండ్రి ఆన్‌షోర్‌ అసెట్‌ ముందుందని తెలిపారు.  


దేశంలోనే ఆయిల్‌, గ్యాస్‌ ఉత్పత్తిలో అగ్రభాగం ఇక్కడి నుంచే..
కేజీ బేసిన్‌ పరిధి నుంచి ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఉత్పత్తిలో దేశంలో 10 శాతం ఇక్కడి నుంచే లభించడంపై ప్రధాని అభినందనలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. కేజీ బేసిన్‌లో ఈస్ట్రన్‌ ఆఫ్‌షోర్‌ నుంచి ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ అతిపెద్ద ఉత్పత్తిని ఇస్తుందని, గడచిన 20 ఏళ్లలో భారీగా ఉత్పత్తిని పెరిగేలా ఛాలెంజింగ్‌గా ఓఎన్జీసీ తీసుకుందని, దాని ఫలితమే నేడు దేశానికి డొమిస్టిక్‌ గ్యాస్‌ పదిశాతానికి మించి అందించే పరిస్థితి లభించిందని తెలిపారు.  


మహిళలకు పెద్దపీట.. ఎంపీ అనురాధ..
మహిళలకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు వారి వృత్తికి అవసరమైన మిషన్లు ఓఎన్జీసీ సీఎస్సార్‌ నిధుల ద్వారా సమకూర్చుతున్నట్లు అమలాపురం ఎంపీ చింతా అనురాధ తెలిపారు. మహిళలు వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం అవ్వాలని సూచించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మహిళల ఆర్థిక ఫ్రీడం సాధించే దిశగా ఓఎన్జీసీ మరింత తోడ్పాటును అందించాలని ఎంపీ అనురాధ ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ ఈడీ అమిత్‌ నారాయణను కోరారు.