AP Sankranthi Holidays: రేపటి నుంచి జూనియర్ కాలేజీలకు 'సంక్రాంతి 'సెలవులు! ఎప్పటివరకంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు (APBIE) సెలవులు ఖరారుచేసింది. ఏపీలో జూనియర్ కాలేజీలకు 7 రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు మంజూరుచేశారు.

Continues below advertisement

AP Sankranthi Holidays for Inter Colleges: ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు (APBIE) సెలవులు ఖరారుచేసింది. ఏపీలో జూనియర్ కాలేజీలకు 7 రోజులపాటు సంక్రాంతి సెలవులు (AP Sankranthi Holidays) ఇచ్చారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సంక్రాంతి సెలవులు ఇచ్చారు.  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ శేషగిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలు తిరిగి జనవరి 18న పున:ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. సెలవురోజుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక, ఈసారి జనవరి 13న రెండో శనివారం, 14న భోగి పండుగ, జనవరి 15న సంక్రాంతి పండుగలున్నాయి.

Continues below advertisement

స్కూళ్లకు సెలవులు ఇలా..
ఏపీలోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులను (Sankranti Holidays) ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాఠశాలలకు మంగళవారం (జనవరి 9) నుంచి సంక్రాంతి సెలవులు అమల్లోకి వచ్చాయి. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని స్కూళ్లను విద్యాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి జనవరి 16 వరకూ సెలవులుంటాయని ప్రకటించారు.. కానీ ఆ తరువాత మార్పులు చేసిన సర్కార్.. జనవరి 9 నుంచి 18 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జనవరి 19న పునఃప్రారంభం కానున్నాయి.

తెలంగాణలో సెలవులు ఇలా..
➥ తెలంగాణలోని పాఠశాలలకు జ‌న‌వ‌రి 12 నుంచి 18 వరకు.. ఏడు రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. పాఠశాలలు తిరిగి జనవరి 19న ప్రారంభంకానున్నాయి. మొదట జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంక్రాంతి సెలవులు కేవలం ఆరు రోజులు మాత్రమే ఇచ్చారని, ఇవి సరిపోవని, ముఖ్యంగా 16న కనుమ పండుగ తర్వాత రోజునే స్కూళ్లకు, కాలేజీలకు రావాలంటే సొంత గ్రామాకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో ఇబ్బంది అవుతుందని తెలిపాయి. కనీసం 18వ తేదీ వరకు సెలవులు పొడిగించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

➥ ఇక తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు మాత్రం కేవలం 4 రోజులు (భోగి, సంక్రాంతి, కనుమ) మాత్రమే సెలవులు మంజూరుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు జనవరి 13 నుంచి 16 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇచ్చింది. తిరిగి జనవరి 17న తరగతులు పునః ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో జూనియర్ కాలేజీల్లో తరగతులు నిర్వహించొద్దని ఆదేశించారు. ఎక్కడైనా తరగతులు నిర్వహించినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ఏపీలో 2024 సాధారణ సెలవులు..
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది(2024) సాధారణ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబరు 30న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జాతీయ సెలవులు, పండుగలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఏడాది మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా(Optional Holidays) ప్రకటించింది. జనవరి 15, 16ను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. భోగి, అంబేడ్కర్ జయంతి ఆదివారం, దుర్గాష్టమి రెండో శనివారం వచ్చాయని తెలిపింది. ఏప్రిల్ 9న ఉగాది సెలవుగా ప్రకటించింది. 

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకారం.. జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ సెలవులను ప్రకటించింది. జనవరి 26న రిపబ్లిక్‌ డే, మార్చి 3న మహా శివరాత్రి, మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ ఫ్రై డే సెలవులుంటాయని ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులో స్ఫష్టం చేశారు. ఏప్రిల్‌ 5న బాబు జగ్జీవన్‌రాం జయంతి, 9న ఉగాది, 11న రంజాన్‌, 17న శ్రీరామ నవమి, జూన్‌ 17న బక్రీద్‌ సెలవులుంటాయని తెలియజేసింది. జూలై 17న మొహర్రం, ఆగస్టు 15 ఇండిపెండెన్స్‌ డే, 26 శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్‌ 7న వినాయక చవితి సెలవులు, 16న ఈద్‌-ఉల్‌-ఉన్‌-నబీ పండుగల సందర్భంగా సెలవులను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, అక్టోబర్‌ 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ సెలవులు ఉంటాయని వెల్లడించింది . వీటితో పాటు మరో 17 ఐచ్ఛిక సెలవుల తేదీలను ప్రకటించింది .

ఆదివారాలు, రెండో శనివారాలకు అదనంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చే ఇతర సెలవులతో కూడి జాబితాను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాలు ఇందులో ఉన్నాయి. వీటిని ప్రభుత్వ సంస్ధలు, కార్పోరేషన్లతో పాటు ప్రభుత్వం కింద పని చేసే అన్ని సంస్ధలు, ఉద్యోగులకు వర్తింప చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ముస్లింల పండుగలైన రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీలకు కూడా ఇందులోనే సెలవులు ప్రకటించినప్పటికీ ఏదైనా మార్పు ఉంటే అప్పుడు మార్చుకునేందుకు వీలు కల్పించింది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola