YSRCP Third List : గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్న సీఎం జగన్... టికెట్ల కేటాయింపులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. పార్టీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్ నుంచి రహస్య రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతగా ఉన్న, ప్రజలకు అందుబాటులో ఉండని నేతలపై వేటు వేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పని తీరును సీఎం జగన్ పరిగణలోకి తీసుకుంటున్నారు. గడపగడపకు కార్యక్రమం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు ? ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏంటి ? అన్న దానిపై సమీక్ష చేసుకుంటున్నారు. రెండు జాబితాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి...ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని పక్కన పెట్టేశారు సీఎం జగన్. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన శాసనసభ్యులే ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గెలిచే వారికే టికెట్ అని తేల్చి పడేస్తున్నారు.
కొనసాగుతున్న మంతనాలు
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు, ఓడేదెవరు అన్న లెక్కలు వేసుకుంటోంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన వైసీపీ...మొత్తం 38 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. చాలా చోట్ల సిట్టింగ్‌లకు హ్యాండ్ ఇచ్చింది. ఇవాళ మూడో లిస్టు విడుదల చేయనుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పలువురు నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్‌ను మార్చాలనే పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం బైరెడ్డి సిద్ధారెడ్డి వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. గత కొంత కాలం నుంచి ఆర్ధర్, బైరెడ్డి సిద్ధారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో ఆర్ధర్ స్థానంలో...ఇక్కడ నుంచి లబ్బి వెంకటస్వామి లేదా డా సుధీర్‌కు సీటు ఖాయం చేసే ఛాన్స్ ఉంది. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగూడ పద్మావతి కూడా తప్పుకోవాల్సిందేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్ పేరు కూడా గల్లంతు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మంత్రుల సీట్లే గల్లంతు
చింతలపూడి నుంచి ఎలిజాకు అవకాశం లేనట్లే అని తేలిపోయింది. ఆయన స్థానంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ విజయరాజు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కోరుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు కూడా మొండి చేయి తప్పదని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ నుంచి ఇంతియాజ్ భాషా, పూల బషీర్, శ్రీ విజయ మనోహరి వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు సీటు గల్లంతవునున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి కప్పట్రాళ్ల బొజ్జమ్మ, విరుపాక్ష, శశికళ, హిమవర్ష రెడ్డి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
బుగ్గనకు మరో ఛాన్స్
మార్కాపురం నియోజకవర్గం అభ్యర్థి మార్పు చేసే ఆలోచనలో ఉంది వైసీపీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని పిలిచి మాట్లాడారు. నియోజకవర్గ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే అంశంపై...ఈ ఇద్దరితో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం పై మంత్రి బుగ్గనతో చర్చించినట్లు సమాచారం. మరోసారి బుగ్గనే ఇక్కడి నుంచి బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.
Also Read:సౌత్ సెంటిమెంట్ కాంగ్రెస్ కు మరోసారి కలిసి వస్తుందా? ఈసారి బరిలోకి ఎవరంటే!
Also Read: ఆంధ్రలో ఎటు చూసినా ఉద్యమాలు - టిక్కెట్ల కసరత్తులో సీఎం జగన్ - ఈ నిర్లక్ష్యం వ్యూహమా ?