Varahi Yatra 2023: వారాహి పేరు పెట్టుకొని అసత్యాల ప్రచారాలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అనవసరంగా ప్రజాప్రతినిధులపై దూషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి అది వరహి వాహనం అయిపోతుందంటూ వ్యాఖ్యానించారు. కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఇచ్చిన కోటి రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోయి జనసేన వచ్చిందని తెలిపారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ రాజశేఖర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో ప్రజారాజ్యంకు సీట్లు తగ్గాయన్నారు. పవన్ కల్యాణ్‌కు ఆయన తల్లిదండ్రులు కల్యాణ్ బాబు అని పెడ్తే.. ఆయన ఆ పేరు ముందు పవన్ అని కలుపుకొని పవన్ కల్యాణ్ అని పెట్టుకున్నట్లుగా చెప్పారు. పవన్ కల్యాణ్ పేరు గాలి కల్యాణ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురుందేశ్వరిపై కూడా మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా అధ్యక్షురాలు అయ్యారు కాబట్టి సంచలనం కోసం పురందేశ్వరి ఆరాట పడుతున్నారని అన్నారు. కావాలంటే పోలవరం తీసుకోండంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. పోలవరం కేంద్రం పర్యవేక్షణలోనే నిర్మాణం అవుతుందన్న విషయం ఆమె తెలుసుకోవాలంటూ చెప్పుకొచ్చారు.
సీఎం జగన్ నాయకత్వంలో ప్రభుత్వం భూమికి సంబంధించిన అనేక సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. 20 ఏళ్లుగా భూమి సాగు చేసుకునే వారికి అన్ని హక్కులూ ఇప్పుడు కల్పించామని చెప్పుకొచ్చారు. అస్సయిన్డ్ భూమి ఇవ్వడం అంటే హోదా పెంచడం కోసమేనని.. అంతేకాని అమ్ముకోవడం కోసం కాదని అన్నారు. ఇంతకు ముందు ఒకరి అసైన్డ్ భూములు మరొకరి అధీనంలోనే ఉన్నాయని ఇప్పుడు మాత్రం హక్కులు భూమి ఉన్నవారికి మాత్రమే కల్పించినట్లు స్పష్టం చేశారు. 20 ఏళ్లుగా భూమి సాగు చేసుకునే వారికి పూర్తి హక్కులు కల్పించామన్నారు. 21 లక్షల ఎకరాలకు పైగా అసయిన్డ్ భూమి ఉందని.. 19 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని చెప్పారు. భూమిపై ఈ ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ మరెవరూ పెట్టలేదని అన్నారు.
పవన్ కల్యాణ్ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారని మంత్రి మేరుగు నాగార్జున తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాలంటీర్లు తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేస్తున్నారని చెప్పారు. ప్రజలు 2024లో పవన్ కి సరైన సమాధానం చెబుతారని వివరించారు.
అక్రమ రవాణా- వాలంటరీ వ్యవస్ధ ఈ రెండింటికీ ముడిపెట్టడం అంటే మోకాలికి బోడి గుండుకి ముడిపెట్టడం లాంటిదేనని ఏపి ఇంటిలెక్చువల్ సిటిజన్స్ ఫోరమ్ , రాష్ట్ర అధ్యక్షుడు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయ్ బాబు అన్నారు. ఏపి ఇంటిలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరమ్ ఆద్వర్యంలో మానవ అక్రమ రవాణా- గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్బంగా విజయబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకి వాస్తవాలు తెలియజేసే ఉద్దేశంతోనే ఇంటిలెక్చువల్ సిటిజబ్స్ ఫోరమ్ ఉందన్నారు. మానవ అక్రమ రవాణాలో వాలంటీర్ల వ్యవస్ధ అనే ఆరోపణలు రావడంతో ఈ అంశం పై ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు.