AP Minister Ambati Rambabu: అమరావతి: మోస్ట్ కన్ ఫ్యూజ్డ్ పర్సన్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్... కాసేపు కలిసొస్తాను అంటాడు, కాసేపు కాదంటాడు అని జనసేన అధ్యక్షుడిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఎదుర్కుంటున్నామో మాకు క్లారిటీ ఉంది. మాజీ సీఎం చంద్రబాబు ఒక్కడిని ఎదుర్కోవటం మాకు పెద్ద సమస్య కాదు అని, కానీ అందరూ కట్టకట్టుకుని వస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఎప్పుడు వెళ్ళిపోతాడో కూడా తెలియదు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చెయ్యటం కోసం ప్రజలు తిరగపడాలా అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ వారాహి మీద తిరిగి పిచ్చి కూతలు కూస్తే సరిపోతుందా.. ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని మంత్రి అంబటి అన్నారు. ఇది కురుక్షేత్ర సంగ్రామం, ఇందులో కౌరవులు ఎలా ఓడిపోతారో మేం చూడబోతున్నాం అన్నారు. పేదలు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధమని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పేదలే ఇందులో గెలుస్తారని వ్యాఖ్యానించారు.
కాపుల కోసం ముద్రగడ నిలబడ్డారు..
ఎన్ని చిత్రహింసలు పెట్టినా కాపుల కోసం ముద్రగడ పద్మనాభం పోరాడారని, కాపులకు అవసరం వచ్చినప్పుడు వారి పక్షాన పోరాటం చేసిన నేత అని కాపు ఉద్యమనేతపై మంత్రి అంబటి రాంబాబు ప్రశంసల జల్లులు కురిపించారు. వంగవీటి మరణానికి ముందు టీడీపీకి ముద్రగడ రాజీనామా చేశారని గుర్తుచేశారు. గతంలో కాపునాడు జరిగినప్పుడు ముద్రగడ జైల్లో ఉన్నారని, వంగవీటికి టీడీపీ వల్ల ప్రాణహాని ఉందని ఆయన ఆనాడే చెప్పారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపుల గురించి మాట్లాడే హక్కు హరిరామ జోగయ్యకు, పవన్ కు లేదని.. ముద్రగడకు మాత్రమే ఉందన్నారు. కాపుల రిజర్వేషన్ పై నిజం మాట్లాడింది జగన్ అని గుర్తుచేశారు.
పవన్ నిలబడిన చోట డిపాజిట్స్ కూడా రావు...
పవన్ మాటల వాళ్లే రోజు రోజుకి ఆయన గ్రాఫ్, జనసేనా పార్టీ గ్రాఫ్ పడిపోతుంది. చంద్రబాబు కోసం కాపులను పవన్ వాడుకోవాలని చూస్తున్నాడు. రాజకీయాల్లో పవన్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడు, ఎందుకు పోటీ చేస్తున్నాడు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడో ఆయనకే తెలియదంటూ జనసేనానిపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి. పవన్ నిలబడిన చోట డిపాజిట్స్ కూడా రావు అని వ్యాఖ్యానించారు. ఆయనకు నిజంగా ప్రాణహాని ఉంటే పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. పవన్ అప్పుడప్పుడు వచ్చి వెళ్లడం వరకు ఓకే కానీ రాజకీయాలకు మాత్రం పనికిరాడని అభిప్రాయపడ్డారు.
లోకేష్ ఎక్కడ నిలబడితే అక్కడ ఓడిపోతాడు...
ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడంతో పాటు మొత్తం 175 స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. పవన్ వారాహి మీద కాదు పంది మీద ఎక్కాడని, పంది మీద ఎక్కి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడంటూ పవన్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో పాటు వెళ్లేసరికి పవన్ కూడా 420 ల తయారయ్యాడు అన్నారు. యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిపోతాడని జోస్యం చెప్పారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial