అమరావతి భూముల విషయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు ఇతరులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను హైకోర్టు కొట్టి వేసింది. జస్టిస్ మానవేంద్రరాయ్ బెంచ్ ఈ మేరకు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాజధానిలో భూములు, కొనుగోళ్లు అక్రమం ఎలా అవుతాయని .. రాజధాని అమరావతిలో వస్తుందని అందరికీ తెలిసినప్పుడు భూములు కొనుగోళ్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టమైన తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలో మాజీ ఏజీపై నమోదైన ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎఫ్‌ఐఆర్‌లను హైకోర్టు కొట్టి వేసింది. 


ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని  ఆరోపిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఆ సిట్ వివిధ రకాలుగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.  ఆ నివేదికలో కృష్ణా జిల్లాలో తన భార్య పేరుపై, బావమరిది పేరుపై భూములు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. దీంతో ఏసీబీ గత ఏడాది సప్టెంబర్‌లో ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులు నమోదు చేసింది.  మొదట దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు 12 మంది ఇతరులపై ఏసీబీ కేసులు పెట్టింది 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకూ ఆయన భూములు కొనుగోలు చేశారని.. ఆ భూములన్నీ సీఆర్డీఏ పరిధి కోర్ క్యాపిటల్ ఏరియా పరిధిలో ఉన్నాయని ఏసీబీ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.  2015-16లోనూ దమ్మాలపాటి శ్రీనివాస్ భూములు కొనుగోలు చేశారని తమ దర్యాప్తుల్లో తేలిందని ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది.
  
తన పై కేసు పెట్టినప్పుడే దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు.  ఎలాంటి ఆధారాలు లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషన్ వేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కేసులో ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తుపై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. ఏసీబీ చెప్పినట్లుగా తాను భూములు కొనుగోలు చేయలేదని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసేందుకే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని దమ్మాలపాటి తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. హైకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ మధ్యలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఇక ఆ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ సర్కార్ ఉపసంహరించుకుంది. నాలుగు వారాల్లో ఆ పిటిషన్‌ను తేల్చాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసి కేసు విచారణ ముగించింది.