దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆయనకు నివాళులు అర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ ఘాట్‌ వద్ద జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయనతో పాటు సతీమణి భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, పలువురు మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుంచి సోదరుడితో దూరంగా ఉంటున్నట్లు కనిపిస్తున్న షర్మిల ఈ సందర్భంగా సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు.



నాన్న దూరమై 12 ఏళ్లు..
వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా తండ్రిని స్మరించుకుంటూ జగన్ ట్వీట్ చేశారు. నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా ప్రజల మనిషిగా నేటికీ జనాల హృద‌యాల్లో కొలువై ఉన్నారని జగన్ తెలిపారు. ప్రజలంతా వైఎస్‌ఆర్‌ను తమ ఇంట్లోని సభ్యునిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు ప్రతి ఒక్కరి మదిలోనూ అలానే నిలిచి ఉన్నాయని అన్నారు. తాను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోందని చెప్పారు. 


గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ట్వీట్..
వైఎస్‌ఆర్‌ను స్మరించుకుంటూ ఏపీ గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ ట్వీట్ చేశారు. వైఎస్‌ఆర్‌ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 ఆరోగ్య సేవలు ఇతర రాష్ట్రాలలో ప్రతిరూపం దాల్చాయని పేర్కొన్నారు.





 Also Read: YS Vijayalakshmi Meet: వైఎస్ విజయలక్ష్మి ఆత్మీయ భేటీ నేడే, దీని వెనుక రాజకీయం అదేనా..? జగన్, షర్మిల హాజరవుతారా..?