AP Government Ordered Pension Hike to 3 Thousand Rupees: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పెన్షన్ (Pension) మొత్తాన్ని రూ.3 వేలకు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనవరి 1 నుంచి పెరిగిన పెన్షన్ అమల్లోకి రానుంది. ఇప్పటివరకూ రూ.2,750 అందిస్తుండగా, ఇక నుంచి రూ.3 వేలు అందనుంది. తాజాగా, జరిగిన కేబినెట్ (Cabinet) సమావేశంలో పెన్షన్ పెంపునకు ఆమోద ముద్ర వేశారు. దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట వృద్ధులు, వికలాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.1000గా ఉన్న పించన్ మొత్తాన్ని సీఎం జగన్ రూ.2,250కు పెంచారు. దశలవారీగా పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం 2022లో రూ.2,500, 2023 జనవరి 1 నుంచి రూ.2,750కు పెంచారు. ఇప్పుడు తాజాగా రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.


వీరే అర్హులు



  • రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్, 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు పెన్షన్ కు అర్హులు

  • 18 ఏళ్లు పైబడి భర్త మరణించిన స్త్రీలు వితంత పెన్షన్ కు అర్హులు, అలాగే 40 శాతం వైకల్యం కలిగి ఉన్న వారు వికలాంగ పెన్షన్ కు అర్హులు.

  • 50 ఏళ్లు పైబడి, కల్లు గీత సంఘాల్లో సభ్యుడిగా లేదా టీపీటీ స్కీమ్ కింద కల్లుగీత కార్మికుడై ఉన్న వారు పెన్షన్ కు అర్హులు

  • ట్రాన్స్ జెండర్లకు 18 ఏళ్ల వయస్సు ఉంటే వారు పెన్షన్ కు అర్హులు

  • 50 ఏళ్ల వయస్సు ఉన్న మత్స్యకారులు పెన్షన్ కు అర్హులు, అలాగే సాంప్రదాయంగా చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్న వారికి 40 ఏళ్లు నిండితే పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు.

  • వివాహం చేసుకున్న మహిళలు భర్త నుంచి విడిపోతే ఏడాది తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. అలాగే, అవివాహితులుగా ఉండి 30 ఏళ్లు నిండిన గ్రామీణ మహిళలు, 35 ఏళ్లు నిండిన పట్టణ మహిళలు పెన్షన్ కు అర్హులు.

  • అలాగే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు సైతం పెన్షన్ కు అర్హులు. వీరికి వయో పరిమితి లేదు. పెన్షన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించి అప్లై చేసుకోవాలి.


వాలంటీర్లకు జీతం పెంపు


అటు, రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లకు సైతం ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 నుంచి వారికి రూ.750 జీతం పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి (Karumuru Nageswararao) నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం వాలంటీర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం లభిస్తోంది. సీఎం జగన్ పుట్టిన రోజు కానుకగా మంత్రి గురువారం ఈ ప్రకటన చేశారు. గురువారం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 'సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్ల వేతనం అదనంగా రూ.750 ఇవ్వబోతున్నాం. జనవరి 1 నుంచే పెంచిన వేతనాన్ని వారు అందుకుంటారు. ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో వాలంటీర్లు మరింత మంచి చేసే అవకాశాన్ని సీఎం జగన్ కల్పిస్తారు.' అని మంత్రి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ సీఎంగా జగన్ అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.


Also Read: Facts about CM Jagan: వైఎస్ జగన్ చికెన్ ఎందుకు మానేశారో తెలుసా? ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు