AP CM Jagan Birthday Special: ఏపీ సీఎం, YSRCP అధ్యక్షుడు జగన్ మోహనరెడ్డి పుట్టిన రోజు ఇవాళ. ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా జగన్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అలవాట్లు, బిహేవియర్‌, లైఫ్‌లో చెప్పుకోదగ్గ విషయాలను కొన్నింటినీ  ఏబీపీ దేశం సేకరించింది. ఇందులో కొన్ని అందరికీ తెలిసినవే ఉన్నాయి. మరికొన్నింటిని జగన్ కు సన్నిహితంగా ఉండేవారి నుంచి సేకరించినవి.


సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి, ప్రాంతీయ పార్టీ ద్వారా 86శాతం అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న నేత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్మోహన రెడ్డి ఒక్కరే. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఏపీలో 50శాతం ఓట్ల షేర్ కూడా సాధించారు. 


2012 కడప పార్లమెంట్ సీట్ ఉప ఎన్నికల్లో జగన్‌మోహనరెడ్డి 5,43,045 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పట్లో అది ఇండియాలో టాప్ -3 మెజార్టీల్లో ఒకటి. 


అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్ -ADR  లెక్కల ప్రకారం ఇండియాలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్. ఆయన ఆస్తి విలువ 510 కోట్లు 


అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రి జాబితాలోనూ కేసీఆర్ తర్వాత రెండోస్థానంలో ఉన్నారు. జగన్ పై మొత్తం 38 కేసులుండగా.. అందులో 35 క్రిమినల్ కేసులు


12 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా.. ఆయన పార్టీ ప్రథాన కార్యాలయంకు వెళ్లింది చాలా తక్కువ. కార్యాలయం ఓపెనింగ్ అప్పుడు మాత్రమే వెళ్లారు. 


జగన్ మోహనరెడ్డి ఎప్పుడూ కూడా పార్టీ కండువాను ధరించరు. పార్టీ అవిర్భావ దినోత్సవంలో కూడా కొన్నిసార్లు పాల్గొనలేదు. 


జగన్మోహనరెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు హైదరాబాద్ – రాయలసీమ విద్యార్థులకు మధ్య గొడవలుండేవి. ఆయన ప్రత్యక్షంగా ఏ గ్రూపులోనూ లేనప్పటికీ రాయలసీమ విద్యార్థి గ్రూపుకు అవసరమైన సాయం చేసేవారు. 
2009లో ఎంపీ అయ్యాక కూడా  జగన్మోహనరెడ్డి తన భార్యతో కలిసి థియేటర్లలో సినిమాలకు వెళ్లేవారు. నందమూరి బాలకృష్ణ ఫేవరెట్ హీరో. వైఎస్ మరణం తర్వాత సినిమాలకు వెళ్లడం దాదాపు మానేశారు. ఇప్పుడు అంత సమయం కూడా ఉండకపోవచ్చు. 


వైఎస్ జగన్ మటన్ ఇష్టంగా తింటారు. 2018 పాదయాత్రకు ముందు వరకూ మటన్ బిర్యానీ (కొద్ది మోతాదులో) తినేవారు. కుండ పెరుగు ఇష్టంగా తింటారు. పాదయాత్ర అప్పటి నుంచి రైస్ పూర్తిగా మానేశారు. ఇప్పుడు కేవలం మటన్ కర్రీ మాత్రమే తింటారు. 


వైఎస్ కు, ఆయన కుమారుడు జగన్‌కు ఇద్దరికీ చికెన్ అంటే బాగా ఇష్టం. కానీ అలాంటి చికెన్‌ను జగన్ మోహనరెడ్డి తండ్రికోసమే వదిలేశారు. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో కడప నుంచి  వైఎస్ గెలుపు చాలా కష్టం అయింది.  ఆ ఎన్నికల్లో వైఎస్ గెలిస్తే.. తనకు ఎంతో ఇష్టమైన చికెన్ వదిలేస్తానని జగన్ నియమం పెట్టుకున్నారు. వైఎస్ తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. అన్నట్లుగానే అప్పటి నుంచి చికెన్ మానేశారు. 


సాక్షి ఏర్పాటు చేసినప్పటి నుంచీ ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ఎడిటోరియల్ ముఖ్యులతో మాట్లాడటం జగన్ అలవాటు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అది క్రమం తప్పకుండా కొనసాగుతోంది. ఆయన పత్రికలను కూలంకుషంగా చదువుతారు. అతి చిన్న విషయాలను కూడా పట్టించుకుంటారు. 


రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా సరే.. కచ్చితంగా ఉదయం 4.30 గంటలకు నిద్ర లేస్తారు. భార్యతో కలిసి కాఫీ తాగుతూ పత్రికలు చదవడం ఆయనకు అలవాటు. కాఫీ కూడా బాగా ఇష్టం. రోజుకు 4-5 సార్లు కాఫీ తాగుతారు. 


జగన్ మనస్తత్వం వైఎస్సార్‌కు పూర్తి భిన్నం. ఆయనకు ఎవరిమీద అత్యంత ఇష్టం కానీ.. అయిష్టత కానీ ఉండవ్. కోపం కూడా ఎక్కువే. కానీ దాన్ని బయటకు ప్రదర్శించరు. చాలా దగ్గర వాళ్లు మాత్రమే జగన్ కోపాన్ని చూడగలరు.