Multi Modal Logistic Parks: విశాఖపట్నం, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఓం ప్రకాష్ వెల్లడించారు. లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వివిధ రాష్ట్రాల్లో మొత్తం 35 ప్రదేశాలను గుర్తించి మల్టీ మెడల్ లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేస్తోందని, వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. నేషనల్ లాజిస్టిక్ పాలసీని కేంద్ర కేబినెట్ ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో లాజిస్టిక్ పార్కులు అభివృద్ధి చేయడం ద్వారా లాజిస్టిక్ సమర్ధత పెంచి వ్యయాన్ని తగ్గించడం నేషనల్ లాజిస్టిక్ పాలసీ ముఖ్య ఉద్దేశమని మంత్రి వివరించారు.
పూర్తిస్థాయి లాజిస్టిక్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయడం ద్వారా లాజిస్టిక్ ఖర్చును గణనీయంగా తగ్గించడం ఎన్ ఎల్ పీ-2022 సమగ్ర ఎజెండా అని మంత్రి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సమగ్రాభివృద్ధి కోసం సమర్థవంతమైన లాజిస్టిక్ సెక్టార్ అవసరమని అన్నారు. మొత్తం జీడీపీలో లాజిస్టిక్ సెక్టార్ వాటాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం లేనప్పటికీ రైల్వే, రోడ్డు రవాణా, జల రవాణా, వాయు రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సేవలు ఇతర లాజిస్టిక్ సెక్టార్ల జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) 2018-19లో 1,71,75,128 కోట్లు, 2019-20 లో 1,83,55,109 కోట్లు, 2020-21లో 1,80,57,810 కోట్లు ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఎగుమతులు, దిగుమతులకు అవకాశం..
విశాఖలో ఏపీఐఐసీకి చెందిన 389.14 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇది జాతీయ రహదారికి 8 కిలో మీటర్ల దూరంలో విశాఖ పోర్టుకు 33 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ లాజిస్టిక్ పార్క్ కేంద్రంగా విదేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు సౌలభ్యంగా ఉంటుంది. విశాఖపట్నంలోని పదకొండ వందల పరిశ్రమలతో పాటు ఆ జిల్లాలో ఫార్మాసిటీకి సమీపంలో ఉంది. ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్, తదితర రాష్ట్రాల్లో పారిశ్రామిక అవసరాలకు ఈ లాజిస్టిక్ పార్క్ కేంద్ర స్థానంగా మారనుంది. లాజిస్టిక్ పార్క్ కోసం గుర్తించిన ప్రాంతానికి పారిశ్రామిక అవసరాల కోసం దాదాపు 9 వేల ఎకరాల భూమి ఏఐసీసీ ఆధీనంలో ఉంది. దాంతో ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రోత్సాహకంగా ఉంటుంది. దాంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి.
అనంతపురంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటుతో పెరగనున్న ఉపాధి అవకాశాలు
అనంతపురంలో లాజిస్టిక్ పార్క్ కోసం ఏపీఐఐసీ 205 ఎకరాలను గుర్తించింది. ఆ ప్రదేశం కియా పరిశ్రమకు 7 కిలో మీటర్ల దూరంలో, జాతీయ రహదారికి 10 కిలో మీటర్లు, బెంగళూరు విమానాశ్రయానికి 142 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రాంతంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటుతో అనంతపురంలో జిల్లాలోని 27 వందల పరిశ్రమలకు ప్రయోజనకరం. ఆటో మొబైల్, సౌర విద్యుత్తు, మినరల్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నికల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఈ లాజిస్టిక్ పార్కు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పార్కు కోసం గుర్తించిన భూములకు సమీపంలో పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ ఆధీనంలో 3 వేల 500 ఎకరాల భూమి ఉంది. దాంతో ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు నెలకల్పేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయి.