CM Jagan Kadapa Tour: ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లా పర్యటన కన్ఫామ్‌ అయింది. పర్యటన వివరాలను కలెక్టర్ విజయరామరాజు మంగళవారం వెల్లడించారు. సీఎం జగన్ డిసెంబర్ 2, 3వ తేదీల్లో జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. డిసెంబర్ రెండో తేదీ ఉదయం ముఖ్యమంత్రి జగన్.. తన నివాసం నుంచి 1.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.15 గంటలకు స్థానిక నేతలతో మాట్లాడతారు. 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు.


వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ ను ప్రారంభించనున్న సీఎం జగన్..


మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ బోటింగ్ జెట్టీని ప్రారంభిస్తారు. 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్ కు బయలు దేరుతారు. 12.40 గంటలకు అక్కడకు చేరుకొని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం అంటే నాలుగు గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. 4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5 గంటలకు హెలికాప్టర్ లో ఇడుపులపాయ హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఓ పది నిమిషాల పాటు స్థానిక నేతలతో మాట్లాడి.. 5.20 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్ హౌజ్ చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. 


డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 8.40 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి కదిరి రోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్ కు చేరుకుంటారు. అక్కడ 9.15 నుంచి 9.30 వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. 9.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి భాకరాపురంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అనంతరం 9.45 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 10.10 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.


నేడు మదనపల్లెకు సీఎం జగన్..


ఏపీ సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా నాలుగో విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగే ఓ కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఈ నిధులు విడదల చేయబోతున్నారు. 2022వ సంవత్సరానికి గాను దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను జగన్‌ మదనపల్లెలో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, ముస్లిం, కాపు, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి.