AP Airports Privatization: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ కింద 2022-25 మధ్య కాలంలో దేశంలోని 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అందులో ఈ మూడు విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. విమానాశ్రయాల ప్రైవేటీకరణపై సోమవారం రాజ్య సభలో కేరళ సీపీఎం సభ్యుడు ఎలమారం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం తెలిసింది. ఇప్పటి వరకు దేశంలోని 8 విమానాశ్రయాలను పీపీపీ విధానంలో లీజుకు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఏపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మిస్తున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు 2,203 ఎకరాలు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2,160.47 ఎకరాలు సేకరించినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వివరించారు.


రాజ్యసభలో టీడీపీ, బీజేపీ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, జీవీఎల్ నరసింహారావులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికి రూ.2500 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం విమానాశ్రయం తొలి దశ పూర్తి అయితే ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల అవసరాలు తీర్చగల్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇచ్చి స్థలానుమతి ప్రకారం ఈ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత 30 ఏళ్ల పాటు వైజాగ్ నావల్ ఎయిర్ ఫీల్డ్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలు నడపకూడదని అన్నారు. ఆ తర్వాత ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అసరాలకు తగ్గట్లు షెడ్యూల్డ్ విమానాలు నడుపుకోవచ్చని వివరించారు. 2022 శీతాకాల షెడ్యూల్ ప్రకారం ఏపీలోని మూడు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 15 అంతర్జాతీయ విమానాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 


గతంలోనే విమానాశ్రయాల ప్రైవేటీకరణకు నిర్ణయం..


2024 ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల ప్రైవేటీకరణ చేపట్టి 860 కోట్ల రూపాయలను రాబట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణ ద్వారా ఎనిమిది వందల కోట్లు, తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణ ద్వారా 260 కోట్లు, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణ ద్వారా 130 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా ముందుకు వెళ్తుంది. 2024లో తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేయాలని భావించిన 2024 కంటే ముందే తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించడానికి బిడ్డింగ్ కి వెళ్తుంది. ఆ తర్వాత జరగబోయే బిడ్డింగ్ లలో విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా ప్రైవేటీకరణ బాట పట్టిన కేంద్రం కష్టాల్లో ఉన్న బ్యాంకులను, పలు పరిశ్రమలను, ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరణ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నాయి. అందులో 24 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండగా, 10 కస్టమ్స్ విమానాశ్రయాలు, 103 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. కేంద్ర విమానాశ్రయాలు ప్రైవేటీకరణ నిర్ణయంతో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆ దిసగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తూ విమానాశ్రయాల ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తోంది.