కోరలున్నప్పుడు చూపిస్తే తప్పేంటి: అనుపమ్ ఖేర్
సెంట్రల్ విస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించినప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది.
జాతీయ చిహ్నంలో మార్పులు చేసి, దేశాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పాత చిహ్నంలో కనిపించే సింహాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవని, వాటిని క్రూరంగా చిత్రిస్తూ కొత్త చిహ్నాన్ని తయారు చేశారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు మరికొందరూ దీన్ని తప్పుబడుతున్నారు. అయితే ఈ వివాదంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ప్రధానమంత్రి సంగ్రహాలయ్ ట్వీట్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ...అందులో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. "సింహానికి కోరలున్నప్పుడు వాటిని చూపించుకోవటంలో తప్పేముంది. ఈ సింహం స్వేచ్ఛాయుత భారత్‌కు ప్రతీక. అవసరమైన సమయాల్లో దాడి చేసేందుకూ వెనకాడదు. జైహింద్" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతకు ముందు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి కూడా ఇదే వివాదంపై స్పందించారు. "అర్బన్ నకల్స్ మాత్రమే కోరల్లేని సింహాన్ని కోరుకుంటారు. దాన్నో పెంపుడు జంతువుగా వాడుకోవాలని చూస్తారు" అని కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ కొత్త యాంబ్లెమ్‌ను తయారు చేసి వాళ్లు మాత్రం డిజైన్‌లో ఏ మార్పూ చేయలేదని అంటున్నారు. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి కూడా ఇదే వివాదంపై ట్వీట్ చేశారు. "జాతీయ చిహ్నం ఎత్తు తక్కువగా ఉంటే కనిపించదనే కారణంతో, ఎత్తు పెంచాం" అని తెలిపారు.