Bengaluru house rentals: మీరు న్యూయార్క్ లేకపోతే లాస్ ఏంజెల్స్.. సిలికాన్ వ్యాలీ వంటి చోట్లకు ఉద్యోగం కోసం వెళ్లి ..ఓ చిన్న ఇల్లు చూసుకోవాలంటే ఆదాయంలో సగం చెల్లించాల్సి రావొచ్చు. అక్కడ అలాంటి డిమాండ్ ఉంటుంది. అదే బెంగళూరులో అయితే.. ఆదాయంలో సగం కంటే ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే పని చేసే జీతం మొత్తం ఇంటి యజమాని ఖాతాలో వేయించి.. ఏమైనా మిగిలితే తిరిగి ఇవ్వండి సార్ అని చెప్పుకోవచ్చని అక్కడి ఉద్యోగులు సోషల్ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు.
ఓ విదేశీ వ్యక్తి బెంగళూరులో ఇంటి అద్దె కోసం సోషల్ మీడియాలో వెదుకుతున్నప్పుడు ఓ పోస్టు కనిపించింది. బెంగళూరులోని హై-ఎండ్ డైమండ్ డిస్ట్రిక్ట్, డోమ్లూర్‌లో 3BHK ఫ్లాట్‌కు నెలవారీ అద్దె రూ. 1.75 లక్షలు మరియు భారీ సెక్యూరిటీ డిపాజిట్ రూ. 19.25 లక్షలు అన్న పోస్టు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఇది చాలా పిచ్చితనమని ఇందిరానగర్ లేదా సమీప ప్రాంతాల్లో 2-3 నెలల డిపాజిట్‌తో, రూ. 80,000 నుంచి 1 లక్ష వరకు అద్దె ఉన్న ఫ్లాట్లు ఏమైనా ఉంటే చెప్పాలని కోరారు.
ఈ పోస్టు వెంటనే వైరల్ అయింది. డిపాజిట్‌ను ఇంటి డౌన్ పేమెంట్‌తో ఇల్లు కొనుగోలు చేయవచ్చని సలహా ఇచ్చారు. మరొకరు హరలూర్‌లో రూ. 2.7 లక్షల నెలవారీ అద్దె, రూ. 15 లక్షల డిపాజిట్‌తో మరో 3BHK పోస్టు కూడా వైరల్ అయింది.
బెంగళూరు అద్దె ఇళ్ల బాధల గురించి, రెంట్ల పెరుగదల గురించి సోషల్ మీడియాలో రోజూ అనేక పోస్టులు కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లే బాధల్లో మొదటిది ఇంటి సమస్యే మరి.