కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న రావి శ్రీనివాస్ ను రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి సస్పెండ్ చేశారు. దీనిపై అదే రోజు రావి శ్రీనివాస్ స్పందించి మాట్లాడారు. సస్పెండ్ తో తనకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆ తరువాత మరుసటి రోజు కాగజ్ నగర్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా ఇన్చార్జి మంత్రిగా పనిచేసిన సీతక్క అహంకారానికి నిదర్శనం తన సస్పెన్షన్ అని, ప్రజా సమస్యలపై ఆమెను ప్రశ్నించినందుకు తనపై కావాలనే వేటు వేశారని రావి శ్రీనివాస్ ఆరోపించారు. తన సస్పెన్షన్ కు గల కారణాలను మంత్రి బహిరంగంగా చెప్పాలన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో 63 వేల పైచిలుకు ఓట్లు సాధించామని, 15 వేల మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తే మంత్రి సీతక్క నిర్లక్ష్యం చేసిందన్నారు. ఫలితాలపై దుష్ప్రచారం చేస్తూ అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ దండె విఠల్ ను పార్టీ లోకి తీసుకున్నారని, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్సీకి పెద్ద పీట వేశారని విమర్శించారు. పదవిలో ఉన్న పలువురు నాయకులు సైతం మంత్రిని ధిక్కరించి మాట్లాడారని వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్టీకి దూరంగా ఉన్నా ప్రజలతో మమేకమై ఉంటానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నా సత్తా ఏంటో చూపిస్తా.. ఎమ్మెల్సీ సత్తా, తన సత్తా ఏదో అప్పుడు తేలుతుందన్నారు.
మంత్రి సీతక్కను విమర్శిస్తే సహించం: మాజీ జడ్పీ ఛైర్మన్ సిడాం గణపతి
మంత్రి సీతక్కను విమర్శించి మాట్లాడే అర్హత రావి శ్రీనివాస్ కు లేదని, రావి శ్రీనివాస్ మతి భ్రమించి మహిళల పట్ల సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మాజీ జడ్పీ ఛైర్మన్ సిడాం గణపతి అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని ఎమ్మెల్సీ దండె విఠల్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన పబ్బం గడుపుకునేందుకు పూటకో పార్టీ మారే రావి శ్రీనివాస్ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ, ఆ తరువాత కాంగ్రెస్, మళ్ళీ భాజపా, ఆ తరువాత బీఎస్పీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి మారారని, ఇలా తన పబ్బం గడుపుకునేందుకు నాలుగుసార్లు పార్టీలు మారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు తిప్పి కొట్టారని, పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేస్తే.. లేనిపోని మాటలు మాట్లాడుతూ.. మంత్రి సితక్కపై విమర్శలు చేయడం సరికాదని, ముఖ్యంగా ఆదివాసులతో పెట్టుకోవద్దని ఆదివాసులతో పెట్టుకుంటే మా తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చాటాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.