ఏపీలో ఇటీవల మిగ్ జాం తుపాను ఎంత బీభత్సం సృష్టించిందో చూశాం. ముందు తుపాను బీభత్సం, ఆ తర్వాత రాజకీయ హడావిడి.. ఇంకా జనం మరిచిపోలేదు. అయితే ఈలోగా మరో తుపాను అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్ని ఛానెళ్లు వాతావరణ హెచ్చరికలు జారీ చేసేసరికి జనం ఆందోళనకు గురవుతున్నారు. మళ్లీ తుపాను ముప్పు ఉందేమోనని కంగారు పడ్డారు. అయితే ఏపీ వెదర్ మ్యాన్ మాత్రం వాస్తవం చెప్పారు. అసలు తుపాను అలర్ట్ ఏదీ లేదన్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని తేల్చేశారు.
ఎందుకీ ఫేక్ న్యూస్..
"బంగాళాఖాతంలో డిసెంబర్ 16న ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. డిసెంబర్ 18కి అది అల్పపీడనంలా మారుతుంది. దాని గమనం శ్రీలంక నుంచి తమిళనాడు మీదుగా ఏపీ వైపు ఉంటుంది. ఈ అల్ప పీడనం భారీ తుపానుగా మారుతుంది. డిసెంబర్ 21నుంచి 25వరకు భారీ వర్షాలు కురుస్తాయి, ఏపీ అల్లాడిపోతుంది." ఇదీ ఆ ఫేక్ న్యూస్ సారాంశం. అచ్చం వాతావరణ విభాగం చేసిన హెచ్చరికలానే ఉంది. జనం కచ్చితంగా నమ్మేలా ఉంది. అల్ప పీడనం ఎప్పుడు ఏర్పడుతుంది, అది తుపానుగా ఎలా మారుతుంది, ఏయే రాష్ట్రాలకు ముప్పు ఉంది.. అనే విషయాలన్నీ ఇందులో కూలంకషంగా ఉన్నాయి. దీంతో ఇది నిజమేనని అందరూ నమ్మారు. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ సర్కులేట్ అవుతోంది.
అదంతా ఫేక్..
ఇటీవలే మిగ్ జాం తుపాను వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కోస్తా జిల్లాల్లో పంట నష్టం సంభవించింది. సీఎం జగన్ పరామర్శకు కూడా వచ్చారు. ఇప్పుడు తుపాను మీద తుపాను అంటే ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకే ఈ వార్త విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఇదిగో పులి అంటే, అదిగో తోక అన్నట్టుగా ఉంది. ఎక్కడ ఏ చిన్న విషయం అయినా ఒకరిద్దరు షేర్ చేస్తే వైరల్ అయిపోతుంది. అందులోనూ తమకు సమాచారం ముందుగా తెలిసిందని అనుకునేవారు కొందరు దీన్ని వైరల్ చేస్తుంటారు. వాట్సప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేస్తుంటారు. దీంతో ఈ వార్త వైరల్ అయింది.
వాతావరణ హెచ్చరికలు సహజంగా అధికారిక అకౌంట్లనుంచి వస్తుంటాయి. ప్రభుత్వం తరపున వాతావరణ విభాగం ప్రకటన రూపంలో జారీ చేస్తుంది. ఆ తర్వాత ఆ ప్రకటనను ప్రభుత్వ విభాగాలు అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తుంటాయి. మీడియాకు కూడా ప్రకటన రూపంలో ఇస్తుంటారు. కానీ ఇప్పుడు వచ్చిన ఫేక్ న్యూస్ నేరుగా సోషల్ మీడియాలో కనపడింది. అయితే ఇది కూడా అధికారులు జారీ చేసిన ప్రకటన అని అందరూ హడలిపోతున్నారు. చివరకు "ఏపీ వెదర్ మ్యాన్" క్లారిటీ ఇచ్చారు.
"ఏపీ వెదర్ మ్యాన్" అనే అధికారిక అకౌంట్ ఇటీవల బాగా పాపులర్ అవుతోంది. ఇదే పేరుతో ఇతర ఫేక్ అకౌంట్లు ఉన్నా కూడా అధికారిక అకౌంట్ నుంచి మాత్రం సరైన సమాచారం వస్తుంది. ఇప్పుడు కూడా ఆ అధికారిక అకౌంట్ నుంచే ఫేక్ న్యూస్ అలర్ట్ వచ్చింది. ఫేక్ న్యూస్ ని ఎవరూ వైరల్ చేయొద్దని, అసలు తుపాను లేదని చెబుతున్నారు ఏపీ వెదర్ మ్యాన్. ఆ పోస్ట్ ని అందరూ ఇప్పుడు షేర్ చేస్తున్నారు. అయితే ఈ నిజం తెలిసే లోపే అబద్ధం సోషల్ మీడియా మొత్తం చుట్టేసింది. దాదాపుగా అందరూ తుపానుపై ఆందోళన పడుతున్న సందర్భం ఇది. కానీ అధికారిక సమాచారం ప్రకారం తుపాను లేదు, అలాంటి అల్పపీడన పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. ప్రజలు నిబ్బరంగా ఉండాల్సిన సమయం ఇది.