ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ సమ్మె ఉద్ధృతమవుతోంది. ప్రభుత్వం హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా మూడో రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం తగ్గేదెలే అంటున్నారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని మాత్రమే తాము అడుగుతున్నామని అంతకు మించి అడగడం లేదని అంటున్నారు. 


మూడో రోజు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి మోకాళ్లపై అంగన్వాడీల నిరసన తెలియజేశారు. ఒక్కో ప్రాంతంల ఒక్కోలా ఆందోళన చేపడుతున్నారు.  శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కూడా అంగన్‌వాడీలు ధర్నా చేపట్టారు. మూడు రోజుల నుంచి చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడో రోజ నిరసనలో భాగంగా అంగన్వాడీ టీచర్లు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేశారు.


పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎల్విన్ పేట జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఎల్విన్‌పేట మూడు రోడ్ల కూడలి వద్ద మోకాళ్లపై కూర్చుని ఆందోళన చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే నిరసన కార్యక్రమాలు మరింత ఉద్ధృతంగా చేపడుతామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేలకు పెంచాలన్నారు. మృతి చెందిన అంగన్వాడి కార్యకర్త ఇంటిలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేపడుతుంటే దానికి విరుగుడుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగాలు పోతాయని నిరసనకారులకు హెచ్చరికలు జారీ చేసింది. అయినా వాళ్లు వెనక్కి తగ్గకపోవడంతో వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో అంగన్‌వాడీ సెంటర్‌లు తెరిచే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. వేసిన తాళాలను పగలగొట్టి సెంటర్‌లు తెరుస్తున్నారు. తాము విధులు నిర్వహిస్తున్న అంగన్వాడి సెంటర్లను తాళాలు పగలగొట్టి తెరిపించడం బాధాకరంగా ఉందని అన్నారు ఉద్యోగులు. తమ సమస్యలు తీర్చకపోతే జగన్‌ను గద్ది దింపే వరకు పోరాడుతామన్నారు.అంగన్వాడీలను చిన్నచూపు చూడడం సరికాదని హితవు పలికారు.


అనంతపురంలో కలెక్టర్‌రేట్ ఎదుట నిరసన చేస్తున్న అంగన్వాడీ సిబ్బందితో ఐసిడిఎస్ పిడి శ్రీదేవి చర్చలు జరిపారు. సమ్మె విరమించాలని సూచించారు. డిమాండ్‌లు తీర్చే వరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీలు, సి ఐ టి యు నాయకులు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కొందరు సిబ్బంది ఆమె చేసిన అక్రమాలపై ప్రశ్నలు సంధించారు. దీంతతో ఆమె అక్కడి నుంచి పరుగులు తీశారు. అధికారపార్టీ నేతలకు శ్రీదేవి తొత్తుగా మారారని సీఐటీయూ ఆరోపించారు. తమపై వివక్ష చూపుతూ మాట్లాడారని విమర్శించారు. ఒక్క అనంతపురంలోనే కాదని ఏరియా పీడీ అధికార పార్టీకి తొత్తుగా మారారని ఆరోపిస్తున్నారు అంగన్వాడీ సిబ్బంది