Trending
Latest Weather Update: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్- మూడు రోజులపాటు ఎండావాన
Latest Weather Update: తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఓవైపు ఎండ మరోవైపు వాన రెండూపోటాపోటీగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది.
Latest Weather Update: ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో వాతావరణం చాలా వైవిధ్యంగా ఉంటోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన వర్షపు జల్లులు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలాంటి వాతావరణం మరో మరో మూడు రోజులు ఉంటుందని ఇరు రాష్ట్రాలకు చెందిన వాతావరణ శాఖలు చెబుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాయి.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు బిహార్ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతోంది. ఈ ప్రభావం లేని ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు పీక్స్‌కు చేరుకుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.
హైదరాబాద్ వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాబోయే తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 °C వరకు పెరిగే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయి. చిరుజల్లులు పడతాయి.
మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఇప్పుడు పైన చెప్పిన ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం, బుధవారం ఉదయం వరకు మాత్రమే ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. బుధారం నుంచి ఆదివారం వరకు ఆయా ప్రాంతాల్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఏ ఏరియాలో కూడా ప్రత్యేక హెచ్చరికలు ఏమీ లేవని వాతావరణ శాఖ పేర్కొంది.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ వాతావరణం చూస్తే ఉదయం ఎండ కాస్త ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.
వచ్చే ఐదు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో నమోదు అవ్వబోయే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కూడా గట్టిగానే ఉంది. అందుకే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో గురు,శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు, ఎల్లుండి అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
సోమవారం నంద్యాలలో 41.5 డిగ్రీలు, కర్నూలు(D) నడిచాగిలో 41.1డిగ్రీలు, వైఎస్సార్(D) బలపనూరులో 41డిగ్రీలు, ప్రకాశం(D) నందనమారెళ్ళలో 40.8డిగ్రీలు, తిరుపతి(D) గూడూరు, విజయనగరం(D) నెలివాడలో 40.6డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైందని వెల్లడించింది. 39 చోట్ల 40డిగ్రీలుకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపింది.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చెట్ల క్రింద నిలబడొద్దని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవుపలికింది. ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి లేదా గొడుగు తీసుకువెళ్లాలని చెప్పింది.