అనంతపురంలో జరిగిన ఓ భారీ చోరీ కేసును జిల్లా పోలీసులు 12 గంటల్లోపే చేధించి, నిందితులను అరెస్ట్ చేశారు. నగరంలోని CMS Info System Ltd కంపెనీలో కస్టోడియన్/ఏజెంట్ గా పని చేస్తున్న పోతులరాజును నిర్బంధించి కళ్లలో కారం కొట్టి, కాళ్లు చేతులు కట్టేసి రూ.46,55,723/- నగదు ఎత్తుకెళ్లారని కంపెనీ ప్రతినిధి శ్రీనివాసులు అనంతపురం ఒన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకున్నారు.


ప్రస్తుతం అరెస్టయిన నిందితుల్లో సాకే పోతులరాజు అనంతపురంలోని CMS Info System Ltd కంపెనీలో మూడు సంవత్సరాల నుంచి కస్టోడియన్/ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. కంపెనీ కాంటాక్ట్ ప్రకారం అనంతపురం నగరంలోని చోళ మండలం ఫైనాన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, ఎల్‌ఐ‌సి, మొదలగు బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల నుంచి కలెక్షన్ అయిన నగదును వారి వద్ద నుండి తీసుకొని వారి అకౌంట్ వున్న బ్యాంక్ లలో జమచేసి వారికి రిసిప్ట్ ఇస్తుంటారు. అంతేకాకుండా వివిధ బ్యాంకులైన కరూర్ వైశ్యా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, Axis, ICICI, IDBI మొదలగు బ్యాంకుల నుండి కూడా నగదును తీసుకొని సదరు బ్యాంక్ ATM లలో క్యాష్ లోడింగ్ చేస్తుంటారు.


ఈ క్రమంలో పోతులరాజు వద్ద పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు గుర్తించిన తన స్నేహితులు అయ్యవారిపల్లి ఖలీల్ బాషా, సయ్యద్ జాబిఉల్లా ఇద్దరి డబ్బులపై ఆశ ఎక్కువై, ఎలాగైనా పోతులరాజు బ్యాంకుల/ఫైనాన్స్ కంపెనీ ల వద్ద తెచ్చే నగదును కాజేయాలని నిర్ణయించుకున్నారు. తన మిత్రుడు అయిన పోతులరాజుతో పెద్ద మొత్తంలో నగదు తెస్తున్నపుడు మాకు సమాచారం ఇవ్వాలని.. ఆసమయంలో వచ్చి కళ్ళలో కారము పొడి చల్లి, నీ మూతికి ప్లాస్టర్ వేసి, చేతులు కట్టేసినట్లు సృష్టించి నీ వద్ద నుండి నగదు దొంగలించుకొని పోతామని మాట్లాడుకున్నారు. వారికి ఎలాగో ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి వారు ఏమీ పట్టించుకోరని చెప్పి ఒప్పించారు. 


పోతులరాజు వారి కంపెనీ ఆదేశాల మేరకు ఉదయం సమయములో స్థానిక సుబాష్ రోడ్ నందు ఉన్న LIC ఆఫీసు వద్దకు వెళ్ళి  రూ.46,55,723/- నగదు తీసుకొని ఎల్‌ఐ‌సి వారి అకౌంట్ లో జమచేయడానికి IDBI బ్యాంక్ కు వెళుతూ తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. అందులో నుంచి Rs.23,00,000/- ల నగదును స్థానిక బోయగేరికి వెళ్లి తన స్నేహితుడు అయిన బొల్లమ్ వెంకట రామారావుకు అప్పగించాడు. అందులో రూ. 3 లక్షలు ఫ్రీగా తీసుకుని రూ. 20 లక్షలు మాత్రమే తర్వాత వెనక్కి ఇవ్వమని పోతులరాజు చెప్పాడు. 


అనంతరం పథకంలో భాగంగా అయ్యవారిపల్లి ఖలీల్ బాషా, సయ్యద్ జబీఉల్లా ఇద్దరు  IDBI బ్యాంక్ వద్దకు వెళ్లారు. మూడవ అంతస్తులో ఉన్న IDBI బ్యాంకు పై అంతస్తు కన్స్ట్రక్సన్ లో ఉండటంతో పోతులరాజును అక్కడికి తీసికెళ్లి కళ్ళలో కారం పొడి చల్లారు. మూతికి ప్లాస్టర్ వేసి, చేతులు కట్టేసి అతని దగ్గర ఉన్న మిగతా రూ.23 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు. ఆ తర్వాత తనను బంధించి కళ్లలో కారం చల్లి, కాళ్లు చేతులు కట్టేసి ప్లాస్టర్ వేసి తను వద్దనున్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారని వీడియో కాల్ ద్వారా పోతులరాజు నాటకం ఆడాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. దొంగతనం చేసిన డబ్బును రికవరీ చేశారు.