AP News : బోయ వాల్మీకి, బెంతు, ఒరియాల జీవనస్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం నియమించిన వన్ మెన్ కమిషన్, జీవో 52ను వెంటనే రద్దు చేయాలని గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 52ను నిరసిస్తూ జీవో ప్రతులను చెత్తబుట్టిలో వేసి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, టీడీపీ బోయ నాయకులు జీవో ప్రతులను చెత్తబుట్టలోకి వేసి ఆందోళన చేశారు.  మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... ఏపీలో ఉండే వాల్మీకి, బోయల భవిష్యత్ కు మరణశాసనం రాసేలా సీఎం జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 52 విడుదల చేశారని విమర్శించారు. జీవో విడుదలలో ఉన్న ఆంతర్యం ఏమిటో? సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. వాల్మీకి బోయలకు ఇంత ద్రోహం చేయడానికి సీఎం జగన్ కు మనసేలా వచ్చిందో చెప్పాలన్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించుకొని జీవనం సాగించిన అత్యంత ప్రాచీన తెగ వాల్మీకి బోయ అని కాలవ శ్రీనివాసులు గుర్తుచేశారు. 


వాల్మీకి బోయ కులస్తులకు న్యాయం చేయాలి


బోయల స్థితిగతుల గురించి ప్రొఫెసర్ సత్యపాల్ 11 నెలలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని కాలవ శ్రీనివాసులు తెలిపారు. ప్రొఫెసర్ సత్యపాల్ చేసిన అధ్యయనానికి మించింది లేదన్నారు. కేంద్ర పెద్దలు వాల్మీకి బోయ కులస్తులకు న్యాయం చేయాలన్నారు.  కేంద్రంలోని బీజేపీ అడిగినా అడగకపోయినా సీఎం జగన్ ఎగేసుకొని మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ రెడ్ల చేతిలో తరతరాలుగా వాల్మీకి వర్గం దోపీడి గురైందని అన్నారు. 


పలు జిల్లాల్లో నిరసనలు 


రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి, బోయ, బొంతు కులాల వారి జీవనస్థితిగతులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ను, జీవో నెంబర్ 52 ఉపసంహరించుకోవాలని ఏపీ ఎరుకల సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పలు జిల్లాల్లో జీవో 52పై గిరిజనులు నిరసవ వ్యక్తం చేశారు.  బోయ వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం నియమించిన వన్‌ మెన్‌ కమిషన్‌ ను వ్యతిరేకిస్తూ అల్లూరి జిల్లాలో నిరసనలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 52ను రద్దు చేయాలని జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఇతర కులాలను గిరిజన తెగల జాబితాలో చేర్చితే అసలైన గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని గిరిజన సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు నష్టం వాటిల్లే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.  లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.