Anantapur Range DIG: అనంతపురం : అనంతపురం జిల్లాలో ఇద్దరు సీఐలపై వేటు పడింది. అనంతపురం రేంజ్ డి.ఐ.జి అమ్మిరెడ్డి ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రి అర్బన్ సి.ఐ హమీద్ ఖాన్, బుక్కరాయ సముద్రం సి.ఐ నాగార్జున రెడ్డిలను అనంతపురం రేంజ్ డి.ఐ.జి అమ్మిరెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 


తాడిపత్రి అర్బన్ సి.ఐ,  బుక్కరాయ సముద్రం సి.ఐలు వేర్వేరుగా ఇద్దరు వ్యక్తుల పట్ల కఠినంగా ప్రవర్తించినట్లు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన కావడం తెలిసిందే. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెంటనే స్పందించి ఇద్దరు సి.ఐ లను వీ.ఆర్ కు తీసుకురావడంతో పాటు విచారణ జరిపించారు. జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఆ ఇద్దరు సి.ఐ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు


సీఐలను వీఆర్ కు తెచ్చి, విచారణ చేయించిన ఎస్పీ
అంతకుముందు తాడిపత్రి అర్బన్ & బుక్కరాయ సముద్రం సి.ఐ లు వీ.ఆర్ కు తెస్తూ ఎస్పీ అన్బురాజన్ రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర విచారణ కోసం అదనపు ఎస్పీ నియమించారు. జిల్లాలో ఇద్దరు సి.ఐ లను వీ.ఆర్ కు తెస్తూ జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. తాడిపత్రి అర్బన్ సి.ఐ హమీద్ ఖాన్ పై మీడియా, సోషల్ మీడియాలలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా మరో కేసులో బుక్కరాయ సముద్రం సి.ఐ నాగార్జునరెడ్డి తనను కొట్టినట్లు బొమ్మలాటపల్లికి చెందిన మహనందరెడ్డి చేసిన వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్పందించారు. ఈ ఇద్దరు సి.ఐ లను వీ.ఆర్ కు పంపారు. తాడిపత్రి ఘటన తరహానే బుక్కరాయ సముద్రం ఘటనపై కూడా సమగ్ర విచారణ చేసేందుకు జిల్లా అదనపు ఎస్పీ విజయభాస్కర్ రెడ్డిని నియమించారు. ఆ నివేదికలు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. విచారణలో వేధింపులు నిజమేనని తేలడంతో సీఐలను సస్పెండ్ చేశారు.


అసలేం జరిగిందంటే..
అనంతపురం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సీఐ నాగార్జున రెడ్డి వికలాంగుడు మహానంద రెడ్డిపై దాష్టీకంగా ప్రవర్తించాడు. ఒక వికలాంగుడు అని చూడకుండా మానవత్వం మరచి ప్రవర్తించాడు. తన శరీరంపై ఉన్న ఎర్రటి వాతలను బాధితుడు మీడియాకి చూపించాడు.
అనంతపురం జిల్లా బుక్కరయసముద్రం మండలం బొమ్మలటపల్లి గ్రామంలో వికలాంగుడు మహనంద రెడ్డి గతంలో పొదుపు సంఘాల అనిమేటర్ గా పని చేశాడు. పొదుపు సంఘాల లో డబ్బు చెల్లింపు విషయాల్లో అవకతవకలు జరిగాయని ఆ డబ్బులు నువ్వు చెల్లించాలి అంటూ, విచారణ పేరుతో సీఐ నాగార్జున రెడ్డి పోలీస్ స్టేషన్ కి పిలిపించి చిత్ర హింసలకు గురిచేస్తున్నాడు అని బాధితుడు ఆరోపించాడు. ఈ రోజు మధ్యాహ్నం లోపు రెండు లక్షల రూపాయలు తీసుకురావాలి లేకపోతే నీ అంతు చూస్తానని బెదిరించాడు. సీఐ నాగార్జున రెడ్డి డబ్బు పొదుపు సంఘాల వారికి ఇవ్వడనికో లేక సీఐ తీసుకోవడానికో నాకు తెలియదు కానీ. డబ్బు తీసుకు రావాలని పదేపదే ఒత్తిడి కి గురిచేస్తున్నాడని బాధితుడు మహానందరెడ్డి వాపోయాడు. సీఐ నాగార్జున రెడ్డి వేధింపులు భరించలేకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడమే తనకు మార్గమంటూ బాధితుడు వాపోయాడు.


వికలాంగుడిపై దాష్టీకంపై ఏబీపీ దేశం ప్రతినిధి ఫోన్లో  సీఐ నాగార్జున రెడ్డిని అడగ్గా.. మహానంద రెడ్డి పొదుపు సంఘాల్లోని డబ్బులను బ్యాంకు ఖాతాల్లో చెల్లిస్తానని చెప్పి పొదుపు మహిళలతో 19 లక్షల మేర డబ్బులు తీసుకుని బ్యాంకుకు చెల్లించలేదన్నారు. పొదుపు సంఘాల మహిళల ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా మహానంద రెడ్డిని విచారణ చేశామని.. మహానంద రెడ్డిపై ఎలాంటి దాడికి పాల్పడలేదని సిఐ నాగార్జున రెడ్డి వివరణ ఇచ్చారు.