Naga Panchami Serial Today Episode
సుబ్బు చెప్పినట్లు సప్తరుషులు నాగ సాధువు కంటపడతారు. మృత్యుంజయ యాగం తమ చేతులతో జరిపిస్తామని ఆ నాగ సాధువుకు మాటిస్తారు. ఇక నాగ సాధువు సప్త రుషులను తన వెంట తీసుకెళ్తాడు. మరోవైపు నాగ లోకంలో ఫణేంద్ర, ఇతర నాగులు నాగదేవతతో మాట్లాడుతారు.
నాగదేవత: మన యువరాణికి నాగలోకం మీద పూర్తిగా ధ్యాస లేకుండా పోయింది. మన మాటల్ని లెక్క చేయడం లేదు. ధిక్యార ధోరణి పెరిగిపోయింది. ఏదో ఒక విధంగా భూలోకంలోనే ఉండిపోవాలని అనుకుంటుంది.
ఫణేంద్ర: కాపాడటానికి తన వెనక సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారనే ధీమాతో ఉంది మాతా.
నాగదేవత: తనకి ఎలాంటి సాయం ఉండదు అని ఆ స్వామి నాకు మాటిచ్చారు. కాబట్టి మనం చాలా సులభంగా యువరాణిని మన లోకానికి తీసుకురావొచ్చు. కానీ సమస్య అది కాదు. తను మోక్షని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాన్ని విఫలం చేయాలి.
ఫణేంద్ర: ఈ సారి అలా జరగకుండా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా మాతా
నాగదేవత: పౌర్ణమి రోజు తనని తాను బంధించడమో.. మోక్షని బంధించడమో చేసి మనల్ని మోసం చేస్తుంది. రేపు కార్తీక పౌర్ణమికి అలా జరగకూడదు. యువరాణి పాముగా మారే సమయానికి మోక్ష పక్కనే ఉండాలి.
ఫణేంద్ర: కానీ ఈ సారి మహామృత్యుంజయ యాగం చేసి గండం నుంచి గట్టెక్కాలి అని చూస్తున్నారు మాతా. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మనం ఏదో ఒకటి చేసి ఆ యాగాన్ని విఫలం చేయాలి
నాగదేవత: నిజమే ఆ యాగ ఫలితం మోక్షకు రక్షణ కవచంలా ఏర్పడుతుంది. అందుకే ఆ యాగం ఎలాంటి పరిస్థతుల్లోనూ జరగకుండా చూడాలి. యువరాజా నువ్వు ఈ నాగకన్యల్ని నీతో తీసుకెళ్లి యాగం చుట్టూ చేరి ఏదో ఒక అలజడి చేసి యాగం ఆగేలా చేయండి. ఆ యాగం ఆపడం మనకు అన్నింటికన్నా ముఖ్యం. తర్వాత నువ్వు యువరాణి దగ్గరకు వెళ్లి మోక్షను కాటేసే పని చూడు. కార్తీక పౌర్ణమి మన నాగ లోకానికి అత్యంత పవిత్రమైన రోజు. ఇక్కడ నేను పూజా కార్యక్రమాలు జరిపించాలి. యువరాణికి రావాల్సిన శక్తులను నేను ప్రసాదిస్తాను. ఆ శక్తులు చేరి యువరాణి మహా శక్తిగా మారి మోక్షను కాటేసి చంపేస్తుంది. ఆ సమయంలో యువరాణి శక్తి పది రెట్లు ఎక్కువ అయి శత్రువు మీదకి విజృంభిస్తుంది. ఆ సమయంలో మన యువరాణికి ఎవ్వరూ అడ్డుకోలేరు. కార్తీక పౌర్ణమి రోజే మన యువరాణిని పీఠం మీద కూర్చొపెట్టి పట్టాభిషేకం అత్యంత వైభవంగా చేయాలి. అంతా నీ చేతుల్లోనే ఉంది యువరాజా.. యువరాణిని జాగ్రత్తగా తీసుకురా.
మరోవైపు నాగులావరంలో శివుడికి పూజలు చేస్తారు. పంచమి దీపాలు వెలిగిస్తుంటుంది. ఇక పంచమి పాముగా మారిన తర్వాత ఎలా అయినా బంధించి ఎవరికీ అనుమానం రాకుండా ఆశ్రమానికి తీసుకెళ్లి పోవాలి అని కరాళి అనుకుంటుంది. నాగసాధువులు వచ్చి మృత్యుంజయ యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని చీకటి పడకుండా అక్కడికి వెళ్లాలి అని మోక్ష వాళ్లతో చెప్తారు. నాగ సాధువు ఆ యాగాన్ని వైదేహి దంపతులకు చేయమని చెప్తారు. దీంతో మోక్షని యాగ స్థలానికి రావొద్దని శివుడి గుడి దగ్గరే ఉండిపోమని చెప్తారు. మోక్ష శివుడి ఆలయం దగ్గర ఉండటమే మంచిదని నాగసాధువు చెప్తారు. పంచమిని వైదేహి రమ్మని పిలిస్తే పంచమి తల్లి వద్దు అని వాళ్లని తాను చూసుకంటానని చెప్తుంది. ఇక నాగసాధువు పంచమికి మంత్ర శక్తి ఉన్న విభూదిని ఇచ్చి శివుడి నామస్మరణ చేస్తూ గుడి చుట్టూ చల్లమని సూచిస్తారు. ఇక మోక్ష విభూది దాటి బయటకు రాకుండా చూసుకోమని చెప్పి సాధువు వెళ్లిపోతారు. ఇక పంచమి మోక్షని గుడి దగ్గరే ఉండమని తొందరగా వచ్చేస్తా అని చెప్పి తన తల్లిని తీసుకెళ్తుంది.
మోక్ష: పంచమి నన్ను కాపాడాలని చూస్తుంది కానీ పాముగా మారితే తనని కాపాడేది ఎవరు
పంచమి: అమ్మా నువ్వు ఇంటికి వెళ్లిపో
పంచమితల్లి: నువ్వు ఈరోజు నాతో మన ఇంటికి రా అమ్మ. నిన్ను నేను చూసుకుంటాను
పంచమి: నాకు ఏం కాదు అమ్మ నా గురించి నువ్వు ఆలోచించకు. సమయం లేదు అమ్మ దయచేసి నువ్వు ఇంటి వెళ్లిపో. రేపటి వరకు ఈ గుడి చుట్టుపక్కలకు రాకు
పంచమితల్లి: నాకు చాలా పెద్ద శిక్ష వేస్తున్నావ్ పంచమి
పంచమి: రేపు తెల్లారితే ఎవరికీ ఏ బాధ ఉండదమ్మా. అన్నింటికీ పరిష్కారం నేను చూపిస్తాను. ఎవరు ఉన్నాలేకున్నా నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలమ్మా. (మనసులో.. నేను ఎన్ని జన్మలు ఎత్తినా నీ కడుపునే పుడతాను అమ్మా. ఈ జన్మకు నా జ్ఞాపకాలు మాత్రమే నీకు మిగులు తాయి.) అమ్మా నేను ఎప్పుడూ నీ గుండెల్లోనే ఉంటాను. నా గురించి దిగులు పెట్టుకోకు. బయలు దేరు అమ్మా ఇంటికి వెళ్లు. (నన్ను క్షమించు అమ్మ నేను ఉన్నా లేకున్నా మీ ప్రేమ అలాగే ఉండాలి అమ్మా. )
మరోవైపు సుబ్బు శివుడి నామస్మరణ చేస్తూ ధ్యానంలో ఉంటాడు. ఇక పంచమి కట్టెలు తీసుకొచ్చి తన కోసం చితి ఏర్పాటు చేస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.