Dharmavaram Politics: ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గ ప్రజల రక్తాన్ని పీల్చడానికి కేతిరెడ్డి ఇక్కడికి తెగబడ్డాడని ధ్వజమెత్తారు. రౌడీ... కబ్జాకోరు అంటూ ఆయనపై గోనుగుంట్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2009లో ఒక సూట్ కేసు తీసుకొని ధర్మవరంలోకి అడుగుపెట్టిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 628 ఎకరాల భూమిని కబ్జా చేసి కొల్లగొట్టాడని ఆయన దుయ్యబట్టారు. 


నియోజకవర్గాన్ని దౌర్జన్యాలకు, అరాచకాలకు, కబ్జాలకు అడ్డాగా మార్చాడని, తద్వారా అమాయక ప్రజల ఆస్తులను కొల్లగొట్టడంతోపాటు, ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేశాడని గోనుగుంట్ల సూర్యనారాయణ ఆరోపించారు. ధర్మవరంలోని జగనన్న టౌన్ షిప్ పక్కన ఉన్న భూమిని బెదిరించి ఎకరం 10 లక్షల రూపాయలు పెట్టి కొన్నాడని, ఆ తర్వాత ఆ భూమిని సెంటు నాలుగు లక్షల రూపాయలు చొప్పున ధర్మవరంలోని అమాయకులకు బెదిరించి అంటగట్టాడని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తాను ఎమ్మెల్యేగా రూ.3,400 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపానన్నారు. 


అయితే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి అన్న పదాన్ని పాతాళంలోకి నెట్టేసి.. తాను ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ నాలుగున్నర సంవత్సరాలు చేయని దౌర్జన్యం లేదన్నారు. అంతేకాక కరోనా సమయంలో తన ఇంటిని క్లబ్ గా మార్చి చేనేత కార్మికులు కోట్లాది రూపాయలు నష్టపోవడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి కారకుడయ్యారని ఆరోపించారు. అడ్డగోలుగా ప్రభుత్వ, ప్రజల భూములను కబ్జా చేసిన వాటిని తాము అధికారంలోకి రాగానే వాటిని స్వాధీనం చేసుకుంటామని, ఆ భూములను చేనేత కార్మికుల ఉపాధికి ఉపయోగిస్తామని, మిగిలిన భూములను ప్రజల పరం చేస్తామని గోనుగుంట్ల ప్రకటించారు.