Anantapur Lovers News: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద స్కూటీ కారు ఢీ కొన్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో యువతి తలకి, కాలికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టణంలోని గుండ్లప్ప దొడ్డి కాలానికి చెందిన గుజ్జల మైతిలిగా పోలీసులు గుర్తించారు. తొలుత దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే, విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
యువతితో మాట్లాడాలని ఓ యువకుడు ఆమెను రమ్మని పిలవగా ఆమె స్కూటీలో అతను కార్లో బయలుదేరారు. ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో స్కూటీని వెనక నుండి కారు ఢీ కొట్టింది. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. కారు డ్రైవర్ గుజ్జల భాస్కర్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి డ్రైవర్ ను పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేశారు. దీంతో అతను ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని నిర్దారించి కేసు నమోదు చేశారు.
పోలీసులు దర్యాప్తులో వెలుగుచూసిన మరో కోణం
ప్రియురాలిది ప్రియుడిది ఒకే గ్రామం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం అమ్మవారి పేటకు చెందిన వారిగా సమాచారం. మైతిలి తల్లి సువర్ణమ్మ కళ్యాణదుర్గం పట్టణంలో పోస్ట్ మాన్ గా విధులు నిర్వహిస్తోంది గత కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త మృతి చెందగా, భర్త ఉద్యోగం భార్యకు వచ్చింది.
అమ్మవారిపేటలో నివాసం ఉన్న సమయంలో ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన భాస్కర్ అనే యువకుడు మైథిలిని వేధించేవాడు. ఇటీవల ఉద్యోగ బదిలీల్లో భాగంగా గత ఆరు నెలల నుంచి తల్లితో పాటు కళ్యాణ దుర్గంలో నివాసం ఉండేది. పెళ్లికి ఆ యువతి నిరాకరించడంతో పథకం ప్రకారమే హత్యాయత్నం చేసినట్లుగా పోలీసులు తేల్చారు. అయితే, ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువతి యువకులు దూరపు బంధువులని వరుసకు అతను ఆమెకు సోదరుడు అవుతాడని గ్రామస్థులు తెలిపారు.