Amit Shah's Car Number Plate: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ముందే CAA అమలు చేస్తామని ఇప్పటికే కీలక ప్రకటన చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అంతా సిద్ధంగా ఉందని, అమలు చేయడమే తరువాయి అని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమిత్ షా ప్రయాణిస్తున్న ఓ వైట్‌కార్ నంబర్ ప్లేట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. DL1C AA 4421 అనే నంబర్ దానిపై కనిపించింది. అందులే CAA (Citizenship Amendment Act) అని ఉండడం ఆసక్తికరంగా మారింది. అమిత్ షా కావాలనే ఈ కార్‌లో ప్రయాణిస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కి అమిత్ షా వైట్ టాటా సఫారీ కార్‌లో వచ్చారు. ఆ సమయంలోనే ఈ వీడియో తీశారు. ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు నెటిజన్లు. CAA అమలుపై అమిత్ షా కమిట్‌మెంట్ ఇదీ అంటూ పొగుడుతున్నారు. ఇదే సమయంలో కొందరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. "నంబర్ ప్లేట్ ఒక్కటి చాలు. అమిత్ షా ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోడానికి" అని స్పందిస్తున్నారు. కేవలం అమిత్ షా కార్‌పైనే కాదు. మరో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్ నంబర్ ప్లేట్‌పైనా CAA అని రాసుంది.
పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act)పై కేంద్రహోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందే దీన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఓ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. CAA అమలులో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా అవేవీ అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ చట్టంలో ఎలాంటి లొసుగులు లేవని అన్నారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఆశ్రయం కోల్పోయిన హిందువులు, సిక్కులు,బుద్ధులు, పార్శీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం తీసుకొస్తున్నట్టు వెల్లడించారు అమిత్‌షా. 2014 డిసెంబర్ 31వ తేదీన కానీ అంతకన్నా ముందుకానీ భారత్‌కి వచ్చిన వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ 370 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తుందని మొత్తంగా NDA 400 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని స్పష్టం చేశారు.
"కొంత మంది పని గట్టుకుని ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారు. CAAకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా ఎవరి హక్కుల్నీ లాగేసుకోవడం లేదు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఎన్నో ఇబ్బందులు పడి భారత్‌కి వచ్చిన వాళ్లకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం"
- అమిత్ షా, కేంద్రహోం మంత్రి
Also Read: అమెరికాలో మరో భారతీయుడు హతం, కూచిపూడి డ్యాన్సర్‌ని కాల్చి చంపిన దుండగులు